గంగమ్మ.. నీకు సాటిలేరమ్మా
పొలంలో పనిచేసుకుంటున్న ఈమె పేరు గంగమ్మ. పాతికేళ్ల క్రితం మద్దనకుంట గ్రామానికి చెందిన హనుమంతరాయప్పతో వివాహమైంది. ఏడాది తిరిగే సరికి పండంటి బిడ్డ (బాలచంద్ర)కు జన్మనిచ్చింది. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఉన్నంతలో హాయిగా సాగుతున్న ఆమె జీవితంలోకి చీకటి తొంగిచూసింది. బిడ్డ పుట్టిన మరుసటి ఏడాదే భర్త హనుమంతరాయప్ప మృతితో అంధకారం అలముకుంది. గుండెల్లో అలజడి.. ఒడిలో రెండేళ్ల బిడ్డ..గంగమ్మ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. బిడ్డకోసం ధైర్యం కూడదీసుకుని పొలం బాట పట్టింది. పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. బిడ్డను డిగ్రీ వరకూ చదివించింది. అయితే గంగమ్మపై విధి మరోసారి కక్షగట్టింది. పోలియో రూపంలో కుమారుడు బాలచంద్రను ఇంటికే పరిమితం చేసింది. అయినా గంగమ్మ వెనకడుగు వేయలేదు. తనరెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలిచింది. తనకున్న 4 ఎకరాల్లో బోరు వేయించి అందులో రెండు ఎకరాల్లో వక్కతోట, మరో రెండెకరాల్లో అరటి తోట సాగు చేసింది. ప్రస్తుతం అందులో అంతర పంటలను సాగు చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంది. నీరు కట్టడం, కలుపు తీయడం, మొక్కలు నాటడం తదితర వ్యవసాయ పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటుంది. భర్త దూరమైనా..చెట్టంత కుమారుడు ఇంటికే పరిమితమైనా వెరవని ధీశాలి గంగమ్మను చూసి జనమంతా...నీకు సాటిలేరమ్మా అంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె జీవిత ప్రస్థానాన్ని వేనోళ్ల పొగడుతున్నారు.
– అమరాపురం:
Comments
Please login to add a commentAdd a comment