మామిడి చెట్లు దగ్ధం
రొళ్ల: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి మామిడి తోటలో కాపు కాసిన 150 చెట్లు కాలి పోయాయి. రొళ్ల మండలం మల్లసముద్రం గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా రైతు గంగమ్మ తనకున్న పొలంలో ఆరేళ్ల క్రితం 200 మొక్కలతో మామిడి తోటను అభివృద్ధి చేశారు. గత రెండేళ్లుగా ఏటా పంట కోతలతో ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం పంట బిందె నుంచి కాయ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం ఉదయం తోటకు సమీపంలోని బయలు భూమిలో ఎండుగడ్డికి ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. ప్రమాదాన్ని గుర్తించి బిందెలతో నీటిని పోసి మంటలు ఆర్పారు ఈ లోపు 150 మామిడి చెట్లు కాలిపోయాయి. అధికారులు పరిశీలించి, తనకు పరిహారం అందించాలని బాధిత మహిళా రైతు కోరారు.
వ్యక్తి బలవన్మరణం
అగళి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం హళ్లికెర గ్రామానికి చెందిన బసవరాజు (55)కు 27 సంవత్సరాల క్రితం జయమ్మతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమారైలకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపారు. కుమారుడు బెంగళూరులో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జయమ్మ కూడా బెంగళూరులోనే కుమారుడితో కలసి ఉంటోంది. బసవరాజు అప్పుడప్పుడు కుమారుడి వద్దకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఇటీవల స్వగ్రామానికి తిరిగి రావాలని పలుమార్లు భార్యకు సూచించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన బసవరాజు... జీవితంపై విరక్తి పెంచుకుని శుక్రవారం తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మెడికల్ రెప్ ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండలంలోని ఓబుళనాయనపల్లి గ్రామానికి చెందిన బాలగాని నరసింహుడు కుమారుడు చక్రవర్తి(32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆరేళ్ల క్రితం బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన చంద్రకళతో బాలగాని చక్రవర్తికి వివాహమైంది. భార్యతో కలసి బెంగళూరులో నివాసముంటూ మెడికల్ ఏజెన్సీలో రెప్రజెంటిటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన చక్రవర్తి కడుపునొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో జీవితంపై విరక్తితో శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన కుటుంబసభ్యులు ఉరికి విగతజీవిగా వేలాడుతున్న చక్రవర్తిని గమనించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
టీడీపీ కార్యకర్తల దాడి
సోమందేపల్లి: ఈదుళబలాపురంలో టీడీపీ కార్యకర్తలు హనుమంతరాయుడు, నరేష్ తదితరులు తమ ఇంటిలోకి చొరబడి దాడి చేశారని జగదీష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి వద్ద ఉంచిన గడ్డిని హనుమంతరాయుడు గొర్రెలు తినడంతో తాము ప్రశ్నించామని, దీంతో వారు తమపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపాడు. అంతటితో ఆగక అదేరోజు రాత్రి ఉద్దేశపూర్వకంగా తమ ఇంటిలోకి చొరబడి హనుమంతరాయుడు వర్గీయులు దాడి చేయడంతో లక్ష్మీదేవి, నాగార్జునకు గాయాలయ్యాయని శుక్రవారం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో జగదీష్ పేర్కొన్నాడు.
చోరీ కేసులో
ముద్దాయికి మూడేళ్ల జైలు
పుట్టపర్తి రూరల్: చోరీ కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పుట్టపర్తి జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి రాకేష్ తీర్పు వెలువరించారు. వివరాలు... ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లి గ్రామానికి చెందిన భీమినేని అమర్నాథ్‌నాయుడు బుక్కపట్నం పీఎం పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు. అతనిపై 2020లో రెండు కేసులు నమోదయ్యాయి. సమగ్ర విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయి అమర్నాథ్‌నాయుడుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాకేష్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను ఏపీపీ రాజేంద్రనాథ్ వినిపించారు.
ప్రమాదంలో చిన్నారి మృతి
పుట్టపర్తి టౌన్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన వినోద్‌కుమార్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం ఉదయం తమ కుమార్తె రిషిక (9)ను పిలుచుకుని పెనుకొండకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు బండ్లపల్లి క్రాస్ వద్ద దిగారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలబడిన రిషికను ఢీకొని వెళ్లిపోయింది. ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మామిడి చెట్లు దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment