వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం

Published Sat, Mar 8 2025 2:06 AM | Last Updated on Sat, Mar 8 2025 2:03 AM

వేపకు

వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం.. పొలాలు ఆక్రమించడం పరిపాటిగా మారింది. తాజాగా కనగానపల్లి మండలం వేపకుంటలో రైతు అశ్వత్థప్పకు చెందిన తోటలో నాలుగు ఎకరాల పంటకు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముత్యాలన్న శుక్రవారం ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టాడు. ఇరుగు పొరుగు వాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకిలా చేశావంటూ అడగడంతో.. సరదా కోసమని వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకున్నాడు. అంతేకాక వాళ్లతో (బాధిత రైతుతో) ఏం అవుతుందిలే అంటూ రుబాబు చేసినట్లు సమాచారం. దీనిపై బాధిత రైతు అశ్వత్థప్ప గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేయగా.. తనకు సంబంధం లేదని బుకాయిస్తూనే ‘నన్నేమీ చేయలేరు. కేసు పెడితే అంతు చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు.

రూ.లక్ష వరకు నష్టం..

రైతు అశ్వత్థప్ప తనకున్న నాలుగు ఎకరాల పొలంలో ఇటీవల ఆముద పంట సాగుచేశారు. ఇంకా పంట సగంలో ఉన్నందున డ్రిప్‌ పరికరాలు తీయలేదు. ఈ క్రమంలో శుక్రవారం పట్ట పగలే ముత్యాలు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. చాలా సేపటి తర్వాత ఇంటికి చేరుకున్న అతడిని గ్రామస్తులు నిలదీశారు. ‘ఏం కాదులే.. అవసరమైతే రోజూ నిప్పు పెడుతా. ఎవరేమీ చేసుకోలేరు’ అంటూ మాట్లాడటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మంటలు పొలమంతా వ్యాపించడంతో 15 కట్టల డ్రిప్పు లాడర్‌, 30 పీవీసీ పైపులు, నాలుగు గేట్‌వాల్వ్‌లు, మూడు ఫిల్టర్లు కాలిపోయాయి. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. పొలంలో చెత్తకు నిప్పు పెట్టి అగ్ని ప్రమాదానికి కారణమైన ముత్యాలుతో పాటు మరో గొర్రెల కాపరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు చేశారు.

నిందితుడి బెదిరింపులు..

తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో పొలాల్లో పంట పెట్టుకోలేరని, అవసరమైతే రోజూ నిప్పు పెడుతూ ఉంటానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బాధితు రైతు కుటుంబ సభ్యులకు ముత్యాలు ఫోన్‌ చేసి బెదిరించాడు. ఎవరు నిప్పు పెట్టారో తనకు తెలుసంటూ ఓ పదేళ్ల బాలుడి గురించి ప్రస్తావించాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు మరో ముగ్గురు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ముత్యాలు వైఖరితో గ్రామస్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విధ్వంసాలను తాము చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పొలంలో వ్యవసాయ పనిముట్లకు నిప్పు

దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ రుబాబు

రూ.లక్షకు పైగా నష్టపోయిన రైతు

No comments yet. Be the first to comment!
Add a comment
వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం 1
1/2

వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం

వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం 2
2/2

వేపకుంటలో టీడీపీ కార్యకర్త దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement