ఘనంగా ఏపీఆర్‌ఎస్ వార్షికోత్సవం
పరిగి: కొడిగెనహళ్లి ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శనివారం వార్షికోత్సవంతో పాటూ ఫేర్‌వెల్ డేను ప్రిన్సిపాల్ ఎన్వీ మురళీధర్‌బాబు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విద్యార్థులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ భావోద్వేగాలకు గురయ్యారు. కార్యక్రమంలో ఎంఈఓ శేషాచలం, పూర్వ విద్యార్థులు వెంకటకృష్ణ( బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈడీ, న్యూజెర్సీ, యూఎస్‌ఏ), కృష్ణవేణి(మేనేజర్, పీవీహెచ్ కార్పొరేషన్, న్యూజెర్సీ), పాఠశాల చైర్‌పర్సన్ కుమారి, వైస్ చైర్మన్ రామాంజనేయులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళ మెడలో
బంగారు గొలుసు అపహరణ
గుత్తి రూరల్: మండలంలోని అబ్బేదొడ్డి గ్రామంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును శనివారం గుర్తు తెలియని దొంగ అపహరించాడు. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవి వేకువజామున ఇంటి బయట పనిలో నిమగ్నమైంది. ఇంతలో ముసుగు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె ఒక్కసారిగా దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరిగెత్తాడు. మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు దొంగను వెంబడించారు. అయితే దొంగ వారికి దొరకకుండా పారిపోయాడు. దొంగ మహిళ మెడలోని గొలుసును లాగిన సమయంలో సగం తెగిపోయి అక్కడే పడిపోగా సగం గొలుసును ఎత్తుకెళ్లాడు. పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment