
పక్కా గృహాల కూల్చివేత
మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన మైనార్టీ కాలనీలోని పలు పక్కా గృహాలు, ఇంటి పునాదులను అధికారులు తొలగించారు. గుట్టుచప్పుడు కాకుండా, లబ్దిదారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ ప్రక్రియను సెలవు రోజైన ఆదివారం చేపట్టడం విమర్శలకు దారి తీసింది. సోమవారం కూడా తొలగింపు ప్రక్రియను అధికారులు కొనసాగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మడకశిరలోని మైనార్టీలకు ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేశారు. ఇందు కోసం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద అప్పట్లో భూసేకరణ చేసి మైనార్టీ కాలనీని ఏర్పాటు చేశారు. దాదాపు 180 మందికి కాలనీలో పక్కా గృహాలు మంజూరు కాగా, ఆర్థికంగా స్థోమత ఉన్న వారు ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరికొందరు పునాదులు వేసుకున్నారు. కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మడకశిర మీదుగా రాయదుర్గం– తుమకూరు రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టాయి. ప్రస్తుతం ఈ పనులు మడకశిర సమీపంలో జరుగుతున్నాయి. ఈ కాలనీ గుండానే రైల్వేలైన్ పోతోంది. దీంతో కాలనీలోని దాదాపు 73 పక్కా గృహాలు రైల్వే లైన్ పనులకు అడ్డంకిగా మారాయి. వీటిని తొలగించాలని సంబంధిత అధికారులు కొన్నేళ్లుగా లబ్దిదారులకు సూచిస్తూ వచ్చారు. అయితే తమకు ప్రత్యామ్నాయం చూపించి ఇళ్లు, ఇంటి పునాదులు తొలగించుకోవాలని స్థానికులు కోరుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం అధికారులు భారీ యంత్రాలతో అక్కడకు చేరుకుని కూల్చివేతలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియను జేసీ అభిషేక్‌కుమార్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జేసీ అభిషేక్‌కుమార్ కల్పించుకుని బాధితులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.
మడకశిరలో రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment