పుట్టపర్తి: బుక్కపట్నం మండలం సిద్దరాంపురం సమీపంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను కలెక్టర్ టీఎస్ చేతన్ బుధవారం పరిశీలించారు. వేరుశనగ దిగుబడిపై రైతు కేశవతో ఆరా తీశారు. నిర్ణీత గడువులోపు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావుకు సూచించారు. అనంతరం సమీపంలోని మునగ పంటను పరిశీలించారు.
చింత పండు ధర తగ్గుముఖం
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం 1573.50 క్వింటాళ్ల చింత పండు విక్రయానికి రాగా... మీడియం ప్లవర్ రకం క్వింటా గరిష్టం రూ. 13వేలు, కనిష్టం రూ.4,300 చొప్పున సగటున రూ.6వేలతో అమ్ముడుపోయింది. అలాగే కరిపులి (ఫైన్) క్వింటా గరిష్టం రూ.33వేలు, కనిష్టం రూ.8వేలు, సగటు రూ.15వేలు చొప్పున ధర పలికింది. గత సోమవారం క్వింటా కరిపులి గరిష్ట ధర రూ.40వేలు కాగా, బుధవారం రూ.33వేలకు చేరుకోవడం గమనార్హం. క్రయవిక్రయాలను మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి పర్యవేక్షించారు.
‘పీఎంఏవై’లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనపు లబ్ధి
ప్రశాంతి నిలయం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక లబ్ధిని ప్రభుత్వం చేకూరుస్తోందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీఎంఏవై 1.0 కింద జిల్లాకు 71,969 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25,203 గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన 40,024 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.80 లక్షలుగా నిర్దేశించినట్లు తెలిపారు. దీనికి అదనంగా బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70 వేలు ఆర్థిక లబ్ధి ఉంటుందన్నారు. ఇందులో నిబంధనలు వర్తిస్తాయన్నారు. తద్వారా జిల్లాలో 9.009 మంది బీసీలు, 1,548 మంది ఎస్సీలు, 548 మంది ఎస్టీలకు అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీవరకు లబ్ధిదారుల ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెళ్లి అదనపు లబ్ధి గురించి వివరించి, వారి ఇంటిని ఫొటో తీసుకుంటారన్నారు.
ఈ–క్రాప్ నమోదు పరిశీలన