పరిగి: తాము అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగించడంతో పాటూ వారికి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు... చివరకు అధికారం చేపట్టిన తర్వాత 2.50 లక్షల మంది వలంటీర్లను తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేశారంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. పరిగి మండలం అక్కంపల్లిలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని సిద్ధింపజేశారన్నారు. మూడున్నర లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వలంటీర్ల ద్వారా సంక్షేమ ఫలాలను అత్యంత పారదర్శకంగా అందజేశారన్నారు. అలాంటి వ్యవస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేసి, కేవలం కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వలెంటీర్లు రోడ్డెక్కి ధర్నా చేసినప్పటికీ కూటమి సర్కార్‌లో చలనం లేకపోవడం మోసానికి ప్రతిరూపంగా నిలిచిందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ లబ్ధి చేకూరుస్తామన్న చంద్రబాబు... నేడు తల్లులనూ దగా చేశారన్నారు. డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి తొమ్మిది నెలలు కావస్తున్నా నేటికీ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతీయువకులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్