
పలాస, నరసన్నపేట, వజ్రపుకొత్తూరు రూరల్: గద్దర్ అస్తమయంతో ఉద్దానంలో విషాదం అలముకుంది. 1969లో జరిగిన శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం తర్వాత ఈ ప్రాంతంలో గద్దర్ పాటలు మార్మోగాయి. ఉద్దానం ప్రాంతంలో 1985 నుంచి 1995 మధ్య కాలంలో అటు పీపుల్స్ వార్ ఇటు పోలీసులతో యుద్ధ వాతావరణం ఉండేది. అప్పట్లో పీపుల్స్ వార్ అమర వీరుల సభలకు కూడా గద్దర్ పోలీసు నిర్బంధాల మధ్య పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. పలాస మండలం బొడ్డపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని, బీసీ వసతి గృహం మంజూరు చేయాలని, ఉద్దానం ప్రాంతానికి మంచినీటి సదుపాయం కావాలని తదితర డిమాండ్లతో బొడ్డపాడు ప్రజలు కాశీబుగ్గలో 1985లో అమరణ నిరాహార దీక్షలు చేశారు.
ఆ సందర్భంగా ఆ ఉద్యమానికి మద్దతుగా మొదటిసారి గద్దర్ ఉద్దానం ప్రాంతంలో అడుగుపెట్టారు. పలాస, మందస, సోంపేట మండలాల్లో పెద్ద ఎత్తున జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రదర్శనలు ఇచ్చా రు. ఆ తర్వాత అనేక సార్లు ఉద్యమ అవసరాలు రీత్యా గ్రామాల్లో పర్యటించారు. 1990లో వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభలో గద్దర్ పోరు పాటలతో హోరెత్తించారు. తీరప్రాంతం జనసందోహమైంది. పీపుల్స్ వార్ ఉద్యమంలో చనిపోయిన వారి సంతాప సభలకు కూడా హాజరయ్యారు.
ఈ విధంగా మందస మండలం బుడార్సింగి, మదనాపురం, అక్కుపల్లి గ్రామాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో 2005 ఆగస్టులో జిల్లా అమరవీరుల స్మారక స్థూపం నిర్మించారు. దాని ఆవిష్కరణ సభకు గద్దర్ హాజరయ్యారు. ‘ఉద్దానం బిడ్డలారా వస్తారా...రారా’ అంటూ ప్రజలను ఉర్రూతలూగించారు. చివరి సారిగి ఈ ఏడాది జనవరి 11న సంక్రాంతి సందర్భంగా పలాస మండలం నీలావతిలో జరిగిన సిక్కోలు జానపద సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కళా జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉద్దానం కంట నీరు పెట్టింది. ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక అధ్యక్ష కార్యదర్శులు లండ రుద్రమూర్తి, నిశితాసి, సిక్కోలు జగదీష్, అందాల కోటేశ్వరరావు, కుత్తుం వినోద్, కళింగసీమ సాహిత్య సంస్థ అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ తదితరులు సంతాపం తెలిపారు. అలాగే సిక్కోలు జానపద సాహిత్స్యకళావేదిక ప్రతినిధులు మల్లేన దేవరాజు, పాపారావు, బొడ్డు గాంధీ, దాసరి తాతారావు తదితరులు సంతాపం తెలియజేశారు. అలాగే నరసన్నపేట మాకివలస ఉన్నత పాఠశాలలో 1980లో నిర్వహించిన విరసం మహాసభల్లోనూ పాల్గొన్నారు. కోమర్తి గ్రామాన్ని సందర్శించారు.
మంచి కళాకారుడిని కోల్పోయాం
గద్దర్ మృతితో మంచి కళాకారుడిని కోల్పోయాం. జీవితమంతా ఆయన ప్రజా పోరాటాలకే అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
– ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
బాధగా ఉంది..
ప్రజా గాయకుడు గద్దర్ మృతి చెందడం బాధగా ఉంది. గడిచిన సంక్రాంతి సందర్భంగా ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ క్షణాలు గుర్తుకు వస్తున్నాయి.
– సీదిరి అప్పలరాజు, మంత్రి
ఉద్దానంలో ఎగిరిన ఎర్ర జెండాలకు ఆయన పాట ఊపునిచ్చింది. ఆ కొండ కోనల్లో ప్రతిధ్వనించిన విప్లవ నినాదాలకు ఆ గొంతు పద సాయం చేసింది. ఉద్యమాల బాటలో ఆయన రాసిన విప్లవాల పాటలు ఓ తరాన్ని ఉర్రూతలూగించాయి. దశాబ్దాల పాటు బాధితుల తరఫున పోరాడిన ఆ ప్రజా యుద్ధనౌక ఇప్పుడు విశ్రమించింది. ఆ ధిక్కార గళం శాశ్వత విశ్రాంతి కోరింది. చైతన్య గీతికకు చిరునామాగా నిలిచిన గద్దర్.. ఇక జ్ఞాపకమయ్యారు. ఆయన గురుతులు తలచుకుని సిక్కోలు కన్నీటి బొట్లను నివాళిగా అర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment