నాటి మత్స్యకార మహాసభలో మాట్లాడుతున్న వైఎస్సార్ (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడానికి మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 31న విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రాష్ట్రంలోనే తొలిసారిగా మత్స్యకార మహాసభను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 2003 ఏప్రిల్ 4న మత్స్యకారులు ఇలాంటి మహాసభనే విశాఖలో నిర్వహించారు. ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ఆ మహాసభలో అప్పటి ప్రతిపక్ష నేత గా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
సరిగ్గా ఇరవయ్యేళ్ల తర్వాత ఇప్పుడు ‘జై మత్స్యకార.. జై జగనన్న’ పేరిట మత్స్యకార మహాసభను నిర్వహిస్తున్నారు. 31 సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మత్స్యకారులు, మత్స్యకార నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల బతుకులు ఎంతగానో మెరుగుపడ్డాయి. సముద్రంలో చేపలవేటపై రెండు నెలల పాటు నిషేధం అమలు సమయానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద వీరికి రూ.10 వేలు చెల్లిస్తోంది. గత ప్రభుత్వంలో ఈ సొమ్ము రూ.4 వేలు మాత్రమే ఇచ్చేది.
మత్స్యకార బీమా సొమ్మును రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో బోట్లకు సరఫరా చేసే డీజిల్‌పై లీటరుకు రూ.6 సబ్సిడీ ఇచ్చేది. అది కూడా ఆర్నెల్లు, ఏడాది తర్వాతో చెల్లించేది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ సబ్సిడీ సొమ్మును రూ.6 నుంచి 9కి పెంచడమే కాదు.. ముందుగానే మత్స్యకారుల ఖాతాలో రాయితీ మొత్తం జమ అవుతోంది.
అంతేకాదు.. మునుపటి ప్రభుత్వంలా కాకుండా అన్ని మెకనైజ్డ్, మోటారు బోట్లకు ఈ రాయితీని వర్తింపజేస్తోంది. అలాగే రూ.152 కోట్ల వ్యయంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ జరుగుతోంది. ఇలా సంక్షేమ పథకాలే కాకుండా మత్స్యకారుల జీవితాలు బాగు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఏడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పోర్టులను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా వేల సంఖ్యలో మత్స్యకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
హాజరుకానున్న మత్స్యకార నేతలు
మహాసభకు మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, తీరప్రాంత ఎమ్మెల్యేలు, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, మత్స్యకార నేతలు హాజరు కానున్నారు. నాటి మత్స్యకార మహాసభలో వైఎస్‌తో పాటు మోపిదేవి, మల్లాడి కృష్ణారావులు పాల్గొనగా, 31న జరగబోయే మహాసభకు కూడా వీరిద్దరూ హాజరవుతుండడం విశేషం! ప్రజలకు, మత్స్యకారులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలపడానికి, ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో ఈ మత్స్యకార మహాసభను ఏర్పాటు చేస్తున్నామని ఈ సభ నిర్వాహకుడు, రాష్ట్ర మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment