అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం | - | Sakshi
Sakshi News home page

అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం

Published Tue, Jul 11 2023 12:12 PM | Last Updated on Tue, Jul 11 2023 12:45 PM

- - Sakshi

‘ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే నిమిషాల వ్యవధిలో అతని పని జరుగుతోంది. ఒక అర్హుడు పథకానికి దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా లబ్ధి అందుతోంది. ఒక విద్యార్థికి బడిలో అడుగు పెట్టిన తొలిరోజే పుస్తకాల నుంచి బ్యాగు వరకు, షూ నుంచి యూనిఫారం వరకు అన్నీ అతని చేతిలో పెడుతున్నారు. వీధి బడులు సకల వసతులతో సగర్వంగా నిలబడుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాలు సర్వసన్నద్ధంగా తయారయ్యాయి. ఒకటో తేదీ రావడమే లేటు ఇంటి తలుపు తట్టి మరీ పింఛన్‌ ఠంఛన్‌గా అందిస్తున్నారు. వీధికే రేషన్‌ తెచ్చి ఇస్తున్నారు. విద్యార్థి నుంచి విశ్రాంత ఉద్యోగి వరకు, బాలల నుంచి వృద్ధుల వరకు అందరి సంక్షేమం కోరే ప్రభుత్వమిది’ అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తమ ప్రభుత్వ పనితీరును వివరించారు. ప్రతిపక్షాలు పనిలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న భావాలు ఆయన మాటల్లోనే..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దేశంలో సంక్షేమ పథకాల నిధులు 90శాతం దుర్వినియోగమై... కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారునికి చేరుతున్నాయని రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నిత్యం ఆవేదన చెందేవారు. వంద శాతం మందికి ఎలా అందించాలా అని ఆలోచించేవారు. ఇవాళ రాష్ట్రంలో ఆ మార్పు వచ్చింది. దీని కోసం వైఎస్‌ జగన్‌ ఓ విప్లవమే తీసుకువచ్చారు. వంద శాతం ప్రజలకు ఒక్క పైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందించి చూపించారు. ఇది ఓ విప్లవాత్మక మార్పు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తనకు కావాల్సిన పనిని చేసుకోలేకపోతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం లేకపోవడమే దీనికి కారణం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది.

సచివాలయ వ్యవస్థ ద్వారా సామాన్యుడికి కావాల్సిన పనులు నిమిషాల మీద జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా పనులు సులభమవుతున్నాయి. అప్పటికే ఒకరో ఇద్దరో అర్హులు మిగిలిపోతే ‘జగనన్న సురక్ష’ ద్వారా వారిని గుర్తించి మరీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఈ విషయాలు పట్టడం లేదు. లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి విద్యార్థులకు ఇచ్చే సంక్షేమ పథకాలపైనా విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులకు ఓటు హక్కు ఉండదని తెలిసినా పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారు.

‘జగనన్న సురక్ష’ ఓ వరం
సంక్షేమ పథకాలు అందని వారికి జగనన్న సురక్ష ఓ వరం లాంటిది. ఇందులో 11 సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో గ్రామంలో 200 నుంచి 400 మంది ప్రజలు ఈ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే 25వేల మంది ప్రభుత్వ సేవలు అందుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వలంటీర్‌, అధికారులు ప్రజల ఇంటికే వెళ్తుండడం వల్ల ఎవరికీ రోజు కూలీ నష్టపోవాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఇదివరకు ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ జగనన్న సురక్ష పథకం ఈ పనిని చాలా తేలిక చేసి చూపించింది.

ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పనితీరు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే టీడీపీ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. అభివృద్ధి అంటే భౌతికంగా కనిపించే అంశాలే అనే భావన చాలా మందిలో ఉంది. ఒక కుటుంబం జీవన ప్రమాణాలు పెంచేదే అభివృద్ధి. విద్య, వైద్యం, పోషకాహారం, భవిష్యత్‌ తరాలకు ధీమా, నివాసయోగ్యమైన ఇళ్లు, మంచి వస్త్రాలు.. ఇవన్నీ జీవన ప్రమాణాలకు కొలమానం. ఈ ప్రయోజనాలు అందించకుండా ఏదేదో చేసేశామంటే ఎవరూ హర్షించరు. వైఎస్‌ జగన్‌ సర్కారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సఫలమైంది.

అన్నదాతకు భరోసా..
రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు, వారికి కావాల్సిన సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాం. గతంలో మండలానికి ఇద్దరు, ముగ్గురు వ్యవసాయ అధికారులు ఉంటే ఇపుడు ప్రతి మండలానికి 25మంది వ్యవసాయ అధికారులు ఉండేలా ఏర్పాటు చేశాం. అదే గ్రామంలో ఎరువులు అందుబాటులో ఉంచడం, పండిన పంట కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. కళ్ల ఎదుటే సచివాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి చేపడితే ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయి. విమర్శించేవారు వారి గ్రామాన్ని ఒకసారి పరిశీలించాలి. ఏం జరిగిందో? ఏం జరగలేదో? వారే చూస్తారు.

అవినీతికి ఆస్కారం లేకుండా..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతి చోటు చేసుకుంది. ఏమిటీ పరిస్థితులని ఒక రకమైన ఆవేదనతో ప్రజలు తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అవినీతికి చరమ గీతం పాడి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లలోకి నేరుగా రూ.2,30,000 కోట్లు జమ చేసింది. ఇందులో ఫలానా వ్యక్తి డబ్బులు అడిగారని గానీ, తాము ఒక పైసా ఇచ్చామని గానీ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు.

చంద్రబాబు ఏం చేశారు..?
టీడీపీ హయాంలో జిల్లాకు ఎలాంటి మేలు జరగలేదు. ఎల్లో మీడియా ద్వారా ఆహా, ఓహో ప్రచారం చేసుకోవడం తప్ప టీడీపీ నాయకులు చేసిన పనులేవీ లేవు. తోటపల్లి, వంశధార, మెడికల్‌ కళాశాల, పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌, ఆఫ్‌షోర్‌ తదితర ప్రాజెక్టులో టీడీపీ పాత్ర ఏమీ లేదు. ఇదంతా వైఎస్సార్‌ హయాంలో జరిగిన అభివృద్ధే. శ్రీకాకుళంలో పెద్ద మార్కెట్‌లో టీడీపీ చేసిందేమీ లేదు. మార్కెట్‌ పునఃనిర్మాణం ఆయన హయాంలో జరిగిందే. ఇపుడు రూ.10కోట్లు పెట్టి రోడ్లుకు టెండర్లు వేశాం. గట్టిగ మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్న ట్టు చెబితే ప్రజలు ఓట్లు వేస్తారనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లో ఉంది.

అవన్నీ కాపీ యాత్రలే..
ఏ రాజకీయ పార్టీ అయినా తన ఉనికి కోసం ఏదో ఒక పేరుతో యాత్రలు చేస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఇటువంటి యాత్రల ద్వారా అధికారం వస్తుందని అనుకుంటే పొరపాటు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేశారంటే అతను ప్రజల యొక్క ప్రతి సమస్య క్షుణ్ణంగా గమనించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ పథకాలు నిష్పాక్షికంగా అమలు చేశారు. మండలం నుంచి గ్రామాలకు పరిపాలనను వికేంద్రీకరించారు. ఒక్కో ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా, ఏ ఒక్కరూ సమస్య పరిష్కరించలేదు. జగన్‌ సీఎం అయిన వెంటనే ఉద్దానంకిడ్నీ సమస్యపై రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వంశధార రిజర్వాయర్‌ నుంచి మంచినీరు ఉద్దాన ప్రాంత ప్రజలకు అందించేందుకు పనులు పూర్తి, కిడ్నీ బాధితుల మందులకు రూ.10వేలు సాయం, డయాలసిస్‌ కోసం అక్కడే ఆసుపత్రి ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు. జగన్‌ను అనుకరించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. స్థిరమైన అభిప్రాయంతో ప్రతిపక్షాలు లేవనేది ప్రజల భావన.

సిక్కోలులో ప్రగతి జాడలు..
గత నాలుగేళ్లలో జిల్లాలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. పలాసలో రూ.60 కోట్లతో ఒక రీసెర్చ్‌ ఆస్పత్రిని తెచ్చాం. అలాగే మంచినీళ్లపేట వద్ద హార్బర్‌ (ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేశాం. రూ.4000 కోట్లతో మూలపేట పోర్ట్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. బుడగట్ల పాలెం వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు, ఆమదాలవలసలో హార్టికల్చర్‌, అగ్రికల్చరల్‌ కళాశాలలు, శ్రీకాకుళంలో 900 పడకల ఆస్పత్రిని సంపూర్ణంగా అభివృద్ధి చేశాం. జిల్లావ్యాప్తంగా రోడ్లు నిర్మితమవుతున్నాయి. ఏం అభివృద్ధి జరిగిందని అడిగే టీడీపీ వాళ్లు వీటిని చూడాలి. జిల్లా వ్యాప్తంగా నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి.

ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు కోసం రూ.780కోట్లు ఖర్చుపెట్టాం. మరో 3–4 నెలల్లోనే ప్రారంభించనున్నాం. పలాసలో ఆస్పత్రికి రూ.60కోట్లు ఖర్చుపెట్టాం. మరో 2 నెలల్లోనే ప్రారంభించనున్నాం. వంశధారపై వివాదం కేసు సుప్రీంకోర్టులో ఉంది. లిఫ్ట్‌ పెట్టి 19 టీఎంసీ నింపి వేసవిలో 2లక్షల ఎకరాలకు రబీ పంటకు నీరు అందించేందుకు నిర్ణయించాం. టెండర్లు పిలిచి అనుమతులు ఇచ్చారు. ఈ వర్షాకాలం ముగిసేలోగా పూర్తి చేయాలని చెప్పాం. కోడి రామ్మూర్తి స్టేడియంపై టీడీపీ సమగ్ర ప్లాన్‌ లేకుండా కూలగొట్టేసింది. దీన్ని మేం బాధ్యతగా తీసుకున్నాం.

దీని నిర్మాణం కోసం రూ.10కోట్లు నిధులు మంజూరు చేశాం. ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు పని జరుగుతోంది. మరో 4–5 నెలల్లో పూర్తవుతుంది. సమగ్ర భూ సర్వేతో కొన్ని ఆక్రమణలు బయటపడుతున్నాయి. వందేళ్లుగా సర్వే జరగకపోవడంతో ఎవరిది ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఆక్రమణలు జరుగుతున్నాయి. ఏ ఆక్రమణను కూడా విడిచిపెట్టేది లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement