
ఉగాది పురస్కారాల కవితా సంపుటాలకు ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: వేమన కవితా నిలయం(శ్రీకాకుళం), తపస్వి మనోహరం (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో ఉగాది సందర్భంగా సాహితీ పురస్కార సభ ఏర్పాటు చేస్తున్నట్లు మహ్మద్ రఫీ, తపస్వీ మనోహరం అధినేత నిమ్మగడ్డ కార్తీక్, బుర్రి కుమారరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విశ్వావసు నామ ఉగాది సందర్భంగా మార్చి 23న జరిగే ఈ సభ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు 2023 ఏడాదిలో ముద్రణ జరిగిన కవితా సంపుటి రెండు ప్రతులను మార్చి 15లోగా పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న మూడు పుస్తకాలకు రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6వేలు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. సభకు హాజరైన వారికి సత్కారం ఉంటుందని పేర్కొన్నారు. కవితా సంపుటాలను పోస్టు లేదా కొరియర్ ద్వారా మహ్మద్ రఫీ (ఈవేమన), ఎస్–1 శారదా అపార్టుమెంట్, లక్ష్మీనగర్, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా 532407 చిరునామాకు పంపించాలని కోరారు.
గుర్తు తెలియని మృతదేహం కలకలం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని హయాతినగరం సమీపంలో నాగావళి నదీ తీరంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వ్యక్తి ఎడమ చేతి భుజంపై మహిళ బొమ్మ, డి.లక్ష్మి అనే అక్షరాలు పచ్చబొట్టుగా వేసి ఉన్నాయని ఒకటో పట్టణ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. బాగా కుళ్లిన స్థితిలో ఉండటంతో సుమారు ఐదు రోజులు కిందట వ్యక్తి చనిపోయి ఉంటాడని, వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నామన్నారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలిని పరిశీలించామని, పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని చెప్పారు. వివరాలు తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయవచ్చన్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
కాశీబుగ్గ: మందస మండలం లోహరిబంద గ్రామంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రి అనూష (14) లోహరిబంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఏం జరిగిందో గానీ ఇంటి పక్కనున్న తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని వెతుక్కుంటూ వెళ్లిన ఉపాధ్యాయులు చెట్టుకు వేలాడటం చూసి నిర్ఘాంతపోయారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాడి రైతులకు పోటీలు
రణస్థలం: ఆధునిక శాసీ్త్రయ పరిజ్ఞానం వినియోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధించి పశుషోషణ లాభసాటిగా మార్చడం, ఔత్సాహిక నిరుద్యోగ యువతను పాడి పరిశ్రమ వైపు ఆకర్షితులను చేసే ఉద్దేశంతో పాల పోటీలు నిర్వహిస్తున్నట్లు రణస్థలం పశుసంవర్థకశాఖ ఏడీఏ బి.దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర స్థాయిలో మార్చి 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లా తోటపాలెంలో కె.వైకుంఠరావు డైరీ ఫారమ్‌లో జరిగే ఈ పోటీలకు పాడి రైతులు పాల్గొనాలని కోరారు.
గంజాయి నేరగాళ్లపై ఉక్కుపాదం
శ్రీకాకుళం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారిని, క్రయవిక్రయాలు జరిపేవారిని, సేవించేవారిని గుర్తించి ప్రత్యేక షీట్లు తెరవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశించారు. రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో కేసులపై సమీక్షించారు. గంజాయి ద్వారా ఆదాయం అర్జించే వారి ఆస్తుల స్వాధీనం చేసుకోవడంతో పాటు పీడీ యాక్టు పెట్టేలా పురోగతి చూపాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా చొరవతీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉగాది పురస్కారాల కవితా సంపుటాలకు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment