సీనియార్టీ జాబితా సిద్ధం
● ఈనెల 10వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణ
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖ భవిష్యత్తులో నిర్వహించే బదిలీలు/పదోన్నతులకు సంబంధించి తొలి అడుగు పడింది. ఈ మేరకు సీనియార్టీ జాబితాను రూపొందించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, తత్సామానమైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా సిద్ధమైంది. ఈ జాబితాను విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో సిద్ధంగా ఉంచినట్టు డీఈవో డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించిన సాధారణ సీనియార్టీ జాబితాలను శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌తో పాటు డీఈవో కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కాగా జాబితాపై అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా లిఖిత పూర్వకంగా కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, ఎంప్లాయి ఐడీ, జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనడంతో పాటు, అందుకు సంబంధించిన ఆధారాలు లేదా సాక్ష్యాలను జతచేయాలని స్పష్టం చేశారు. గడువు తేదీ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం జరగదన్నారు. మరిన్ని వివరాలకు 90009 07101, 85558 20983, 81341 42450 నంబర్లను సంప్రదించాలన్నారు.
హుండీ ఆదాయం రూ.8.58 లక్షలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని తాత్కాలిక హుండీ ఆదాయం రూ.8,58,795లు వచ్చిందని ఆలయ ఈవో పి.ప్రభాకరరావు సోమవారం తెలిపారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తుల సమక్షంలో ఈ హుండీ ఆదాయం లెక్కించారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ.2,00,260లు, కేశఖండన ద్వారా రూ.1,560లు, స్థల పురాణం ద్వారా రూ.2,320లు, ఫొటోల అమ్మకం ద్వారా రూ.530లు, పులిహోర ద్వారా రూ.1,03,440లు, హుండీ కానుకల రూపంలో రూ.4,76,185లు, ఇతరుల ద్వారా రూ.74,500లు కలిపి మొత్తం రూ.8,58,795లు వచ్చిందన్నారు. కాగా గతేడాది రూ.7,55,558లు వచ్చాయి. కార్యక్రమంలో కొమనాపల్లి సత్యసాయి సేవా సంఘం అధ్యక్షుడు పైడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సెమినార్‌కు ఆహ్వానం
హిరమండలం: మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజుకు అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిర్వహించే రెండు రోజుల జాతీయ సెమినార్‌కు ఆహ్వానం అందిందని దుర్భలాపురం గ్రామానికి చెందిన బాలరాజు సోమవారం తెలిపారు. తన సేవలను గుర్తించిన యూజీసీ ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. అలాగే గూనభద్ర గ్రామానికి చెందిన విద్యావేత్త అంపిలి ప్రశాంత్‌కుమార్‌కు సైతం ఆహ్వానం అందింది. ఈనెల 6, 7 తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ సెమినార్ జరగనుంది. ఈ ఇద్దరూ ఆ సెమినార్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రణస్థలం ఏజెన్సీకి బాధ్యతలు
పొందూరు: పట్టణంలో ఉన్న ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ బాధ్యతలను రణస్థలం గ్యాస్ ఏజెన్సీకి తహసీల్దార్ ఆర్.వెంకటేష్ రామానుజులు సోమవారం అప్పగించారు. గ్యాస్ బండపై బిల్లు కంటే అదనంగా వసూళ్లు చేస్తున్న విషయంపై పొందూరులో పలువురు మహిళలు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డీఎస్‌వో జి.సూర్యప్రకాష్, తహశీల్దార్ ఆర్.వెంకటేష్ విచారణ జరిపారు. విచారణలో రూ.40 నుంచి రూ.50ల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు నిరూపణ కావడంతో చర్యలు తీసుకున్నారు. గోడౌన్‌లో స్టాక్‌ను నమోదు చేసి రణస్థలం ఏజెన్సీకి అప్పగించారు. కార్యక్రమంలో వీఆర్వోలు ఈశ్వరరావు, శంకరరావులు పాల్గొన్నారు.
సీనియార్టీ జాబితా సిద్ధం
సీనియార్టీ జాబితా సిద్ధం
సీనియార్టీ జాబితా సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment