తుది దశకు ఇంటర్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ (ఐపీఈ మార్చి–2025) పబ్లిక్ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల్లో భాగంగా 8వ రోజు సోమవారం సెకెండియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మ్యాథ్స్ 2బి, జువాలజీ, హిస్టరీ–2 తదితర పేపర్లకు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 17523 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 351 మంది గైర్హాజరయ్యారు. అధికారులు, స్క్వాడ్‌లు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సీజన్‌లో మొదటిసారి బ్లాంక్ ఓఎంఆర్ షీట్‌ను ఉపయోగించారు. పొందూరు ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థికి బ్లాంక్ ఓంఆర్‌ను వినియోగించినట్టు ఆర్‌ఐఓ పి.దుర్గారావు ధ్రువీకరించారు. మంగళవారం ప్రథమ సంవత్సం హెచ్‌ఈసీ, తదితర గ్రూప్‌ల పరీక్షలు ముగియనున్నాయి.
రెండో రోజూ నిరాశే
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో తొలి సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్టును తాకే అద్భుత దృశ్యానికి మరోసారి మబ్బులు అడ్డంకిగా మారాయి. తొలిరోజున కూడా ఇలాగే మబ్బులు అడ్డుగా రావడంతో భక్తులకు నిరాశ మిగల్చగా.. రెండో రోజూ కూడా భక్తులకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో సోమవారం ఉదయం 4 గంటల నుంచి వేచి చూసిన భక్తులకు నిరాశ తప్ప లేదు. ఉదయం 6.45 గంటల తర్వాత సూర్యకిరణాలు ఆలయంలోని గోపురం స్థాయికి చేరిపోయాయి. దీంతో మళ్లీ ఈ ఏడాది అక్టోబర్ 1,2 తేదిల్లో ఇలాగే కిరణ దర్శనం ఉంటుందని, అంతవరకు భక్తులకు ఆగాల్సిందేనని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలియజేశారు.
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవారి కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో వేంచేసింపజేసి ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని జరిపించారు. రూ.500 చెల్లించిన భక్తదంపతులు కల్యాణ సేవలో పాల్గొనగా, ఆలయం తరఫున స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ, సూపరింటెండెంట్ కనకరాజు పాల్గొన్నారు.
తుది దశకు ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment