పట్టుబడిన గంజాయి ముఠా
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద కాశీబుగ్గ పోలీసులకు గంజాయి ముఠా సోమవారం పట్టుబడింది. ఈ మేరకు కాశీబుగ్గ పట్టణ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా హరుపదర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు వినయమిన్ మాఝీ, ఆయుభ మాఝీలు అన్నారు. వీరికి ఉదయగిరి బ్లాక్‌కు చెందిన మైఖేల్ బదరైతతో పరిచయం ఉంది. మైఖేల్ తమ గ్రామ పరిసర ప్రాంతాల్లో గంజాయి పండిస్తుంటాడు. దీంతో అతడు తన గ్రామానికే చెందిన జాన్, అన్నదమ్ములు వినయమిన్, ఆయుభలకు గంజాయి రవాణా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. పలాస రైల్వేస్టేషన్‌లో తాను చెప్పిన వ్యక్తికి గంజాయి అప్పగిస్తే కిలోకి రూ.1000లు చొప్పున ఇస్తానని తెలిపాడు. దీంతో వీరు ముగ్గురు ఒక ద్విచక్ర వాహనంపై గంజాయి తీసుకొస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ముగ్గురినీ అరెస్టు చేశారు. కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment