తప్పిపోయిన బాలుడు తల్లి చెంతకు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం తండ్రితో పాటు వెళ్లిన ఒక బాలుడు తప్పిపోయాడు. అయితే మూడు గంటల వ్యవధిలోనే తప్పిపోయిన బాలుడిని రెండో పట్టణ పోలీసులు సాంకేతికత సాయంతో తల్లి చెంతకు చేర్చారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నగరంలోని సత్యలాడ్జి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద బాలుడు ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు 112కి కాల్‌చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌కు వెళ్లాక బాబును సీఐ పి.ఈశ్వరరావు వివరాలు అడిగినా చెప్పలేకపోయాడు. దీంతో వెంటనే వెంటనే బాలుడి ఫొటోలు తీసి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్, స్థానికంగా ఉన్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వివరాలతో సహా పంపారు. తన కుమారుడి ఫొటో వాట్సాప్ గ్రూపులో కనిపించడంతో అది చూసిన వాంబేకాలనీకి చెందిన బమ్మిడి రూప సాయంత్రం 5 గంటలకు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. బాబు తన భర్త వెంట నడిచి వెళ్లాడని, ఆ విషయం తన భర్త గమనించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదురయ్యిందన్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment