
దివ్యాంగులపై దయ లేదాయె..!
● టెక్కలి ఆస్పత్రిలో దివ్యాంగుల అవస్థలు
● పింఛన్ల పునఃపరిశీలన పేరిట
తిప్పిస్తున్నారని ఆవేదన
టెక్కలి: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులు అవస్థలు పడ్డారు. ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చేపడుతున్న పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియలో భాగంగా బుధవారం సంతబొమ్మాళి, పాతపట్నం మండలాల నుంచి సుమారు 50 మంది వరకు దివ్యాంగులు చేరుకున్నారు. అయితే పునఃపరిశీలన ప్రక్రియ ఆపివేశామంటూ అక్కడ సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల క్రితం అనేక ప్రయాసలతో పునఃపరిశీలన కోసం వస్తే 5వ తేదీన రావాలని చెప్పారని.. తీరా మండుటెండలో అవస్థలు పడుతూ వస్తే ఇప్పుడు తాత్కాలికంగా నమోదు ఆపివేశారని చెప్పడం భావ్యం కాదంటూ పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాల నుంచి ఇక్కడకు రావాలంటే ఆటోల్లో అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఇలా అకస్మాత్తుగా నమోదు ఆపివేయడం సరికాదని నిరాశగా వెనుదిరిగారు. కాగా, పింఛన్ల పునఃపరిశీలన తాత్కాలికంగా ఆపేసిన విషయం తెలియక దివ్యాంగులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో త్వరలోనే పునఃపరిశీలన ప్రారంభించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment