వీఆర్‌ఓలపై ఇతర శాఖల పెత్తనం తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం చలాయిస్తున్నారని, వారు చేయాల్సిన పనులు తమపై నెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే ఇటువంటి చర్యలకు అడ్టుకట్ట వేయాలని కోరుతూ వీఆర్‌ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమీపంలోని డచ్‌భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె.వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వీఎల్‌ఆర్ శాస్త్రి, గౌరవాధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీరాజ్, సర్వే ఉద్యోగుల విధులు కూడా తమతో చేయించడం దారుణమన్నారు. ఇప్పటికే పీజీఆర్‌ఎస్, రెవెన్యూ, భూ వివాదాలు, ఇతర అంశాలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, 24 గంటలు పనులు చేస్తున్నా పని భారం తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాక తమకంటే తక్కువ స్థాయి కలిగిన వారు కూడా గ్రేడ్– 1 వీఆర్‌ఓలపై పెత్తనం చలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ విజన్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పారు. నిరసన కార్యక్రమంలో వీఆర్‌వోల సంఘం ప్రతినిధులు అప్పలనాయుడు, విశ్వేశ్వరరావు, శ్రీనివాసరావు, తౌడు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment