దివ్యాంగులపై అక్కసు! | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులపై అక్కసు!

Published Mon, Mar 10 2025 10:14 AM | Last Updated on Mon, Mar 10 2025 10:15 AM

దివ్య

దివ్యాంగులపై అక్కసు!

ఉపాధ్యాయ బదిలీల్లో..
● ఇటీవల విడుదల చేసిన ముసాయిదాపై తీవ్ర విమర్శలు ● 80 వరకు ప్రాధాన్యత పాయింట్ల పెంచడంపై అభ్యంతరం ● సవరణలు చేసి న్యాయం చేయాలని వేడుకోలు

శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగ ఉపాధ్యాయులపై కూటమి సర్కారు అక్కసు ప్రదర్శిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల నిబంధనల ముసాయిదా మార్గదర్శకాలు దివ్యాగుంలు, శారీరక వైకల్యం, అనారోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వారికి తీరని నష్టం కలిగించేలా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సీనియారిటీ, రోస్టర్‌ పాయింట్లను తుంగలొకి తొక్కిన కూటమి సర్కారు.. టీచర్ల వైకల్య శాతాన్ని అమాంతం పెంచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆర్థోపెడికల్‌, విజువల్లీ ఛాలెంజ్డ్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ నిబంధనలతో తీవ్ర అన్యాయం జరిగి బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో పాఠశాల విద్య పరిధిలో దివ్యాంగులు, వివిధ తీవ్ర రుగ్మతలు కలిగినవారు 294 మంది వరకు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

వైకల్య శాతాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు..

వాస్తవానికి వైకల్యశాతాన్ని బదిలీల్లోకి తీసుకొచ్చి 2017లో అన్యాయం చేసింది నాడు చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ సర్కారేనని వారంతా గుర్తుచేస్తున్నారు. నాడు 40 శాతం వైకల్యం కలిగినవారికి ప్రాధాన్యత పాయింట్లను కేటాయించారు. 2023లో వైఎస్సార్‌సీపీ అధికారంలో వచ్చాక దానిని విభిన్నమైన రీతిలో వైకల్యాన్ని గుర్తించి మేలుచేసేలా చర్యలు చేపట్టింది. దీంతో ఎక్కువ వైకల్యం కలిగినవారికి బదిలీల్లో మరింత న్యాయం జరిగింది. వైకల్యశాతాన్ని బట్టి వారికి సమన్యాయం చేశారు. మరళా కూటమి సర్కారు 2025లో చేపట్టనున్న బదిలీల మార్గదర్శకాల్లో వైకల్యాన్ని 80 శాతం వరకు తీసుకెళ్లడాన్ని వాంతా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నవారికి వైకల్యశాతం 70 శాతం దాటి ఇవ్వడంలేదు. ఈ కోవకు చెందినవారు జిల్లాలో 50 మంది వరకు ఉన్నారు. దీనికితోడు ట్రాన్స్‌ఫర్స్‌కు మాన్యువల్‌ సర్టిఫికెట్‌ సరిపోదు. శ్రీకాకుళంలో రిమ్స్‌ మెడికల్‌ బోర్డులో డాక్టర్లు సర్టిఫై చేసిన సర్టిఫికెట్‌ మాత్రమే అనుమతిస్తారు. ఈ లెక్కన వారంతా తీవ్ర అన్యాయానికి గురవుతారని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

శారీరక వికలాంగులు అంటే..

●దృశ్యపరమైన వారు/ఆర్థోపెడికల్‌ చాలెంజ్‌డ్‌ ఉద్యోగులకు 80 శాతం కంటే ఎక్కువ లేదా సమానం.

● దృశ్యపరమైన వారు/ ఆర్థోపెడికల్‌ చాలెంజ్డ్‌/ వినికిడి లోపం ఉన్న ఉద్యోగులకు 70 శాతం కంటే ఎక్కువ లేదా సమానం.

● క్యాన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ/కర్ణిక సెప్టల్‌ లోపాన్ని సరిదిద్దడం/అవయవ మార్పిడి, మేజర్‌ న్యూరో సర్జరీ, బాంక్‌ టీబీ, కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌/డయాలసిస్‌, వెన్నెముక శస్త్రచికిత్స వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.

●మానసిక దివ్యాంగులు/చికిత్స పొందుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు, జీవిత భాగస్వామి కలిగినవారు

●జువైనెల్‌ డయాబెటీస్‌/ తలసేమియా వ్యాధి/హీమోఫిలియా వ్యాధి/మస్కులర్‌ డిసీజ్‌/కండర క్షీణతతో బాధపడుతున్న వారిపై ఆధారపడిన పిల్లలతో టీచర్లు. అలాగే చికిత్స కొనసాగుతున్న టీచర్లకు ప్రాధాన్యతా పరంగా పాయింట్లను కేటాయించనున్నారు.

●ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌–2/ఉపాధ్యాయులు పైన పేర్కొన్న కేటగిరీ కింద బదిలీ కోసం దరఖాస్తుచేసుకున్న వారు జిల్లా/రాష్ట్ర మెడికల్‌ బోర్డ్‌ ద్వారా ధ్రువీకరించబడిన అన్ని మెడికల్‌ రిపోర్టులు/సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా కొత్తగా సమర్పించాలి. పాత సర్టిఫికెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.

అభ్యంతరాల స్వీకరణ..

ఉపాధ్యాయ బదిలీ నిబంధనల ముసాదాయిదా మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాశాఖలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటుంది. ఎలాంటి అభ్యంతరాలున్నా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ప్రత్యేకంగా మాడ్యూల్‌ను కూడా ఆన్‌లైన్‌లో ఉంచింది. దివ్యాంగులు వారి సమస్యలు తెలియజేయవచ్చు.

– డాక్టర్‌ ఎస్‌.తిరుమల చైతన్య,

జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం

No comments yet. Be the first to comment!
Add a comment
దివ్యాంగులపై అక్కసు! 1
1/1

దివ్యాంగులపై అక్కసు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement