
ఉపాధ్యాయా.. ఇదేందయ్యా..!
● టీడీపీ అవిర్భావ దినోత్సవంలో టీచర్ ● వెల్లువెత్తిన విమర్శలు
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండిగల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూల ఉపేంద్ర సందడి చేశారు. అమలపాడు ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇతను చురుకుగా కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో ఇతని వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ నాయకుడు దువ్వాడ జయరాం చౌదరి, ఇతర కార్యకర్తలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతా తానై ముందుకు నడిపించి, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.