
సమస్యలు పరిష్కరించాలి
జి.సిగడాం: సమస్యలు పరిష్కరించాలని కోరు తూ జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణల పేరిట విడుదల చేసిన జీఓలో ఈఓపీఆర్‌డీలకు, పరిపాలనాధికారులకు 30 శాతం కోటాను అమలు చేస్తూ ఎంపీడీఓలుగా నియమించాలని, ఎంపీడీఓల డైరెక్ట్ నియామకాలకు స్వస్తి పలకాలని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పరిపాలనాధికారి రామకృష్ణ, రాజశేఖర్, రత్నకుమారి, వెంకట్, దాలిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నాపురంలో విషాదం
నరసన్నపేట: మండలంలోని చెన్నాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన గంగు సోమేశ్వరరావు(28) తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నాపురం గ్రామానికి చెందిన సోమేశ్వరరావు భార్య శ్రావణితో కలిసి కోదాడలో టైల్స్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ట్రిప్పర్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావు మృతితో తల్లిదండ్రులు తవిటేసు, నీలవేణి, భార్య శ్రావణి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని చెన్నాపురం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుడు కొంక్యాన వేణుగోపాలరావు తెలిపారు.

సమస్యలు పరిష్కరించాలి