
అర్జీదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
భానుపురి: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డీపీఎంలు, ఏపీఓలు, ఇతర అధికారులతో రాజీవ్ యువ వికాస పథకం అమలు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, పెన్షన్లు, సెర్ఫ్, ఇందిరమ్మ ఇళ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సోలార్ విలేజ్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మునగాల మండలం ఎంపీఓ దార శ్రీనివాసరావు అకాల మరణంపై కలెక్టర్ సానుభూతిని వ్యక్తం చేసి ప్రభుత్వం తరఫున అతని కుటుంబానికి పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస పథకం ద్వారా జిల్లాలో అర్హులైన నిరుద్యోగ యువతీయువకులకు యూనిట్లు అందేలా చూడాలన్నారు. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సలహాలు సూచనల కోసం సిబ్బందిని నియమించాలని సూచించారు. జిల్లాకు మంజూరైన 4,549 ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో అర్హత ఉన్నవారికి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 5వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, ఎంపీడీఓలు, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.
1.24 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం
ప్రతిఒక్కరూ రోజు సన్న బియ్యం బువ్వ తినాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పథకంలో భాగంగా రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా 1.24 లక్షల మంది లబ్ధిదారులకు 2,500 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని 14వ నంబర్ రేషన్ షాపును అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ఆయన సందర్శించారు. సన్న బియ్యం నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం షాపులో ఉన్న స్టాక్, బియ్యం నాణ్యత, ఈ–పాస్ మిషన్‌లో జరుగుతున్న లావాదేవీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కలెక్టర్ వెంట డీటీ నాగలక్ష్మి, రేషన్ డీలర్ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

అర్జీదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి