
ముగిసిన పదో తరగతి పరీక్షలు
సూర్యాపేట టౌన్: గతనెల 21న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఒక్కో పరీక్ష నిర్వహించారు. చివరి రోజు సోషల్ స్టడీస్ పరీక్షకు 11,912 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 11,885 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. 11 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను 8 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను బుధవారం స్టేట్ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్, సమగ్ర శిక్ష అధికారి రాధారెడ్డితోపాటు నాలుగు స్క్వాడ్ బృందాలు, డీఈఓ తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ అశోక్ తెలిపారు. అలాగే గురువారం ఒకేషనల్ విద్యార్థులకు 13 సెంటర్లలో పరీక్ష జరుగుతుందని చెప్పారు.
ప్రజా భద్రత కోసమే పోలీస్ వ్యవస్థ
చివ్వెంల: ప్రజా భద్రత కోసమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్.జనార్దన్ అన్నారు. బుధవారం రాత్రి చివ్వెలం మండలం ఎంజీనగర్ తండాలో నిర్వహించిన పోలీస్ ప్రజా భద్రత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో అల్లర్లు, సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేస్తామన్నారు. యువత బెట్టింగ్‌లు పెట్టి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌లు మహేశ్వర్, కనకరత్నం, గ్రామ పోలీస్ అధికారి ఎం.సురేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సూర్యాపేట డీఎస్పీగా పార్థసారథి
సూర్యాపేట టౌన్: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం వరంగల్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. కాగా ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రవి ఇటీవల డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో బుధవారం నిత్యారాధనలు కొనసాగాయి. శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన పదో తరగతి పరీక్షలు

ముగిసిన పదో తరగతి పరీక్షలు