
శపథం చిత్రంలో ప్రముఖ తారల పట్టిక పెరుగుతోంది. ఈరం చిత్ర కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం శపథం. 2009లో విడుదలైన చిత్రం ఈరం. అరివళగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించారు. దర్శకుడు శంకర్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా 14 ఏళ్ల తర్వాత అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం శపథం. అయితే ఈ చిత్రం ద్వారా దర్శకుడు అరివళగన్ నిర్మాతగా అవతారమెత్తారు. ఆయన తన ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థ 7జీ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది.
ఇందులో ఆది పినిశెట్టికి జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె నటిస్తున్న తమిళ చిత్రం శపథం. కాగా ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ తరహాలో రూపొందిస్తున్న విభిన్న కథా చిత్రం శపథం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇందులో లైలా ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో ప్రముఖ నటి సిమ్రాన్ శపథం చిత్రం నటించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించారు.
ఇంతకుముందు సిమ్రాన్, లైలా పార్తేన్ రసిత్తేన్, పితామగన్ చిత్రాల్లో కలిసి నటించారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత శపథం చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించడంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు అరివళగన్ తెలిపారు. సిమ్రాన్ నటిస్తున్న 50వ తమిళ చిత్రం ఇది కావడం గమనార్హం.