
తిరువొత్తియూరు: స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యసాయిరెడ్డి (21) చైన్నె తురైపాక్కంలో ఉన్న హాస్టల్లో ఉంటూ శ్రీపెరంబుదూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి కోయంబేడు నూరడుగుల రోడ్డులో ఉన్న వివాహ మండపంలో జరిగిన స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్‌లో స్నేహితులతో కలిసి సత్యసాయి రెడ్డి పాల్గొన్నాడు. లైట్ మ్యూజిక్‌కు డ్యాన్స్ వేస్తున్న సమయంలో చెవి నుంచి రక్తం వచ్చింది.
కొద్ది సేపటికే స్ఫృహ తప్పి కింద పడిపోయాడు. స్నేహితులు అతన్ని హుటాహుటిన అన్నానగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్నేహితుడి మృతదేహాన్ని చూసి స్నేహితులు బోరున విలపించారు. కోయంబేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. విచారనలో సాయికి ఫిట్స్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment