అన్నానగర్: వేప్పనపల్లి సమీపంలో మంగళవారం ధర పడిపోవడంతో మూడు టన్నుల టమాటాలను ఓ రైతు నదిలో పడేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా వేపనపల్లి పరిసర ప్రాంతాలలో సుమారు రెండువేల ఎకరాలలో రైతులు టమాట సాగు చేశారు. ఇక్కడ పండే టమాటాలు చైన్నె, తిరుచ్చి, మదురై తదితర జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. వేప్పనపల్లి ప్రాంతంలో టమాటాల రాక పెరిగింది. దీంతో ధర భారీగా పడిపోయింది. కిలో టమాటా 2 నుంచి 3 రూపాయలకు విక్రయిస్తున్నారు.
15 కిలోల బుట్టను రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. పెట్టుబడి సొమ్ము కూడా రాకపోవడంతో వేప్పనపల్లి సమీపంలోని పత్తిమడుగు గ్రామానికి చెందిన వెంకటేశం అనే రైతు మంగళవారం కృష్ణగిరి టమాటా మార్కెట్‌లో తన పంటను విక్రయించేందుకు వెళ్లాడు. అయితే ధరలు పడిపోవడంతో టమాటాలను అమ్ముకోలేక తీవ్ర మనోవేదనకు గురై ఇంటికి తిరిగొచ్చాడు. అనంతరం కార్గో వాహనంలో సుమారు మూడు టన్నుల టమాటాలను నాచికుప్పం సమీపంలోని మార్కండేయ నదిలో పడేశాడు. రైతు చేసిన ఈ చర్య ఆ ప్రాంతంలోని వాహనదారులు, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment