సాక్షి, చైన్నె: ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ర్యాలీ, మరోవైపు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి కారణంగా దురైన ట్రాఫిక్ కష్టాలు ఇద్దరు మహిళా ఐపీఎస్‌లకు కష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఆ ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ కంపల్సరీ వెయిటింగ్‌లో ఉంచారు. ఈ మేరకు మంగళవారం హోంశాఖ కార్యదర్శి పి. అముదా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. బీజేపీ నేతృత్వంలో సోమవారం సాయంత్రం చైన్నెలో సనాత ధర్మానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నుంగంబాక్కంలోని హిందూ దేవదాయ శాఖ కార్యాలయం వైపుగా బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్తున్నా పోలీసులు కొంత దూరం వరకు అడ్డుకోలేదు.
ఈ పరిణామాలతో నుంగంబాక్కం పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ఫలితంగా వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. అంతకు ముందు ఆదివారం రాత్రి పనయూరు సమీపంలో జరిగిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి రూపంలో ట్రాఫిక్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఈ సెగ ఏకంగా సీఎం స్టాలిన్‌కు కూడా తగిలింది. ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
ఈ రెండు ఘటనల పరిణామాలతో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లపై పోలీసు బాసులు కన్నెర్ర చేశారు. అన్నామలై ర్యాలీ పుణ్యమా గ్రేటర్ చైన్నె పోలీసు(తూర్పు) లా అండ్ ఆర్డర్ డీఐజీ, జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్, ఏఆర్ రెహ్మాన్ కారణంగా తాంబరం కమిషనరేట్ పరిధిలోని పల్లికరణై డిప్యూటీ కమిషనర్ దీపా సత్యన్‌ను బదిలీ చేశారు. ఈ ఇద్దర్నీ కంపల్సరీ వెయిటింగ్‌లో ఉంచారు. అలాగే, చైన్నె ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ ఎన్‌ఫోర్సుమెంట్ సెల్ ఎస్పీగా ఉన్న ఆదర్శ్ పచిరాను తిరునల్వేలి తూర్పు డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment