కారు ఢీకొని తెలుగు జర్నలిస్టు మృతి
సాక్షి, చైన్నె : మదుర వాయిల్ బైపాస్ రోడ్డులో అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఢీ కొనడంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న తెలుగు జర్నలిస్టు ప్రదీప్‌కుమార్ మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని లక్ష్మి నరసింహరాజు వారి పాళెంకు చెందిన ప్రదీప్‌కుమార్(39) చైన్నె అంబత్తూరులో భార్య, కుమార్తెతో నివాసం ఉన్నాడు. గతంలో పలు తెలుగు ఛానళ్లలో కెమెరా మెన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం యూట్యూబ్ చానల్ నడుపుతూ జర్నలిస్టుగా జీవితాన్ని సాగిస్తున్నారు. అలాగే పార్ట్ టైమ్‌గా బైక్ ట్యాక్సీని నడుపుకుంటూ కుటుంబాన్ని చైన్నెలో ప్రదీప్‌కుమార్ పోషిస్తూ వచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో బైక్ ట్యాక్సీ బుకింగ్ ను ముగించుకుని మదుర వాయిల్ బైపాస్ మీదుగా అంబత్తూరుకు వెళ్తుండగా అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఢీకొంది. కారు ఢీ కొన్న వేగానికి బైపాస్ రోడ్డు అవతలకు 100 అడుగుల దూరంలో ఎగిరి పొదళ్లలో ప్రదీప్ పడ్డాడు. శరీరం చిద్రం కావడంతో ఘటనా స్థలంలోనే మరణించాడు. తప్పించుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ కారు నడిపిన వ్యక్తికి అందులోని సెన్సార్ డిస్ కనెక్ట్ కావడంతో కిలో మీటరు దూరంలో కారు ఆగి పోయింది. దీంతో కారును వదలి పెట్టి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణమైన ఆ కారు వేలప్పన్ చావడికి చెందినదిగా గుర్తించారు. బుధవారం ఉదయాన్నే సమాచారం అందుకున్న తెలుగు, తమిళ పాత్రికేయులు, కెమెరామెన్‌లు కేఎంసీ మార్చురీకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ప్రదీప్ కుటుంబ సభ్యులు చైన్నెకు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా, ప్రదీప్‌కుమార్ కుటుంబానికి తెలుగు పాత్రికేయుల సంఘం ( తేజస్) తరపున రూ. 50 వేలు సాయం అందించనున్నట్టు ప్రధాన కార్యదర్శి గోటేటి వెంకటేశ్వరరావు, కోశాధికారి పి. నరసింహ తెలిపారు. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేయడమే కాకుండా ఇతర పాత్రికేయులు అందించే ఆర్థిక సాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందజేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment