నేడు వందే మెట్రో పరుగు | India first Vande Metro to revolutionise inter city travel in Gujarat: PM Modi to inaugurate | Sakshi
Sakshi News home page

ఇంటర్‌సిటీ స్థానంలో వందే మెట్రో

Published Mon, Sep 16 2024 6:13 AM | Last Updated on Mon, Sep 16 2024 6:46 AM

India first Vande Metro to revolutionise inter city travel in Gujarat: PM Modi to inaugurate

దేశంలో తొలి సర్వీసు నేడు ప్రారంభం

అహ్మదాబాద్‌–భుజ్‌ మధ్య సేవలు, త్వరలో చెన్నై–తిరుపతి మధ్య..

తదుపరి జాబితాలో సికింద్రాబాద్‌–విజయవాడ 12 కోచ్‌లు.. 1,150 సామర్థ్యంతో సీటింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వందే మెట్రో రైళ్లను తిప్పాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందేభారత్‌ రైలు సిరీస్‌లో మరో కొత్త కేటగిరీని ప్రారంభిస్తోంది. దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సోమవారం పట్టాలెక్కుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి 360 కి.మీ. దూరంలో ఉన్న భుజ్‌ నగరం మధ్య ఇది రాకపోకలు సాగిస్తుంది. ఇప్పటికే మరిన్ని వందే మెట్రో రైళ్లను సిద్ధం చేసిన రైల్వే శాఖ, త్వరలో వాటిని కూడా ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చెన్నై–తిరుపతి మధ్య దీన్ని నడపనున్నట్లు సమాచారం. తదుపరి జాబితాలో వరంగల్‌ మీదుగా సికింద్రాబాద్‌–విజయవాడ రూట్‌ ఉంది.

వందేభారత్‌ తరహాలోనే..
వందే మెట్రో కూడా వందేభారత్‌ రూపులోనే ఉండనుంది. బయటి నుంచి చూస్తే పెద్దగా తేడా ఉండదు. కానీ, లోపలి వ్యవస్థ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది. దీని సీటింగ్‌ పూర్తిగా వేరుగా ఉండనుంది. ముగ్గురు చొప్పున కూర్చునే వెడల్పాటి సీట్లను ఏర్పాటు చేశారు. సీట్ల మధ్యలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించేందుకు వీలుగా లోకల్‌ రైళ్లలో ఉన్నట్టుగా రూఫ్‌ భాగంలో హ్యాండిల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో 12 కోచ్‌లుంటాయి. మొత్తం 1,150 మంది కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. నిలబడి ప్రయాణించేవారితో కలుపుకొంటే మొత్తం సామర్థ్యం 3208 అవుతుంది. ఈ రైళ్లలో రిజర్వేషన్‌ వ్యవస్థ అమల్లో ఉండదంటున్నారు. అందుకే సీట్లకు నంబరింగ్‌ ఉండదు.

350 కి.మీ. నిడివి వరకు..
100 నుంచి 350 కి.మీ. దూరం ఉండే రెండు ప్రధాన నగరాలు/పట్టణాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ట వేగం 110 కి.మీ. వీటిలో ప్రతి కోచ్‌లో రెండు చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్‌ మోడల్, మరోవైపు వెస్ట్రన్‌ మోడల్‌ టాయిలెట్‌ ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు, భవిష్యత్తులో నాన్‌ ఏసీ రైళ్లను కూడా నడపనున్నట్టు సమాచారం.

కనీస చార్జీ రూ.30
ఈ రైళ్లలో కనీస చార్జీ రూ.30. దూరాన్ని బట్టి గరిష్ట చార్జీ (350 కి.మీ.­కు) రూ.445గా ఉండనుంది. సీసీ కెమెరాలు, ఎమర్జె­న్సీ బట­న్, నేరుగా లోకోపైలట్‌తో మాట్లా­డేందు­కు టాక్‌ బ్యాక్‌ యూనిట్, అగ్నిమా­పక వ్యవస్థ, ఇన్ఫర్మేషన్‌ స్క్రీన్, ఫైర్‌ అలా­రమ్, దివ్యాంగుల టాయిలెట్, అనారోగ్యా­నికి గురైన వారికి స్ట్రెచర్‌ తదితరాలు రైల్లో ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement