చెన్నె: సినిమాలతో అశేష జనాన్ని అలరించి లక్షలాది అభిమానం సొంతం చేసుకున్న తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి ఈసారి పోటీ చేయనుంది. ఈ సందర్భంగా కమల్ కోయంబత్తూర్ దక్షిణం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం ఆయన హాట్ టాపిక్ అయ్యారు. నామినేషన్ పత్రాల్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చర్చకు దారి తీశాయి.
మొత్తం ఆస్తులు రూ.176.93 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో కమల్ ప్రకటించారు. వాటిలో స్థిరాస్తులు రూ.131.84 కోట్లుగా, చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. దీంతోపాటు లండన్‌లో రూ.2.50 వేల డాలర్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు, రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉందని అఫిడవిట్‌లో పొందుపర్చారు. ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రూ.49.5 కోట్లు అప్పు ఉందని తెలిపారు. అయితే కమల్ మాత్రం పదో తరగతి కూడా చదవలేదు. తాను 8వ తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపారు.
రూ.17.79 కోట్ల విలువైన వ్యవసాయ భూములు (37.59 ఎకరాలు), చెన్నెలో రూ.92.05 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. చెన్నెలో ఉన్న రెండు నివాసాలు విలువ రూ.19.5 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో కమల్‌హాసన్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. మూడో కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌హాసన్ ఎలాంటి ప్రభావం చూపిస్తారోనని దక్షిణ భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment