సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో అలజడి సృష్టించిన ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రిజనార్ధన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారితో స్థిరాస్థి వ్యాపార సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మరికొన్ని కంపెనీల్లోనూ ఈ సోదాలు జరిగా యి.
పదుల సంఖ్యలో ఐటీ అధికారులు.. 60కిపైగా ప్రాంతాల్లో పలు కీలక పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఆరా తీసిన అధికారులు, సదరు నాయకులకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత వివరాలు, ఆధారాలతో ఫతేమైదాన్‌లోని ఐటీ ఆఫీస్‌లో మంగళవారం హాజరుకావాలని సూచించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీలోని శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులు, జూబ్లీహిల్స్‌లోని మర్రి జనార్ధన్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులో సోదాల సందర్భంగా వారి అనుచరుల ఆందోళనలు కొంత ఉద్రిక్తతకు దారితీశాయి.
ఇద్దరు ఎమ్మెల్యేలు బ్యాంకు ఖాతాలతోపాటు బ్యాంకు లాకర్లను సైతం తెరిపించి సోదాలు చేపట్టారు. శుక్రవారం లైఫ్‌స్టైల్ సంస్థ డైరెక్టర్ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగాయి. కాగా, ఐటీ సోదాలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పు డు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment