
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు వేసవి ఎండతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు.
వివరాల ప్రకారం.. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తూర్పు, ఉత్తరాన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జూన్ 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు.. దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, తెలంగాణవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రైతులు విత్తనాలు వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్‌ఎంసీ అప్రమత్తం!
Comments
Please login to add a commentAdd a comment