సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టింది. పరీక్షలను సులభతరంగా నిర్వహించే క్రమంలో అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది.
ఆగస్టు 1 నుంచి 22వ వరకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల వారీగా తేదీలను ఖరారు చేస్తూ రూపొందించిన వ్యూహాత్మక టైమ్‌టేబుల్‌ను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఉంచింది. విద్యార్హతలు సమానమైన కేటగిరీ కొలువులకు పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. తద్వారా అభ్యర్థులు ఒక పేపర్‌లో అర్హత సాధిస్తే సంబంధిత పోస్టులకు అర్హత సాధించినట్లే.
పేపర్ వన్, టూల్లోనే ఉమ్మడిగా..
టీఆర్‌ఈఐఆర్‌బీ రూపొందించిన పరీక్షల షెడ్యూల్ కాస్త ఒత్తిడి కలిగించే వి«ధంగా కనిపిస్తున్నప్పటికీ ఉమ్మడి పరీక్షలతో అభ్యర్థులకు భారీ ఊరట లభించనుంది. సులభతర పరీక్షా విధానం ఉండటంతో రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌టేబుల్ ఉందని అధికారులు చెబుతున్నారు. మొదటి సెషన్ కింద ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యా హ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
పలు పోస్టులకు పేపర్–1, పేపర్–2లను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. పీజీ అర్హతతో ఉన్న పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీ కొలువులకు పేపర్–1 పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తున్నా రు. అంటే ఒక అభ్యర్థి ఈ మూడు పరీక్షలకు దరఖాస్తు చేసి.. కేవలం ఒకసారి పేపర్–1 పరీక్ష రాసి అర్హత సాధిస్తే మూడింటికీ పేపర్–1లో అర్హత సాధించినట్టేనన్నమాట. పీజీటీ, జేఎల్ కొలువుల పేపర్–2 పరీక్షలను కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు.
ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన పెడగాగి (విద్యాబోధన శాస్త్రం) ఒకే రకంగా ఉండటంతో ఈ రెండు కేటగిరీలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇక పేపర్–3 పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. పరీక్ష తేదీలు ఎక్కడా క్లాష్ కాకుండా పక్కా షెడ్యూల్ తయారు చేసినట్లు వివరించారు. పరీక్షలన్నీ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఫలితాలను కేవలం నెలరోజుల్లో విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment