సాక్షి, హైదరాబాద్: అదో చెరువు.. అంతగా సాగునీటి వనరులు లేని ఆ గ్రామంలో ఆ చెరువు నీళ్లే వ్యవసాయానికి ఆధారం.. అందుకోసం పల్లంగా ఉన్న ప్రాంతానికి నీటి నిల్వను చెరువుగా చేసి పక్కాగా కట్టకట్టి నీటి విడుదలకు తూము నిర్మించారు. ఇదంతా వందేళ్ల నాటి సంగతి. ఇప్పుడు ఆ చెరువుతో పనిలేదు. అయితే, తూము నిర్మాణానికి వినియోగించిన రాళ్లు మామూలువి కాదని, అవి ఓ జైన క్షేత్రం శిల్పాలతో కూడిన శిలలని తేలింది.
వాన నీరు... చెట్టు నీడన
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ చెరువు కట్ట తూము నిర్మాణంలో రాళ్లుగా వినియోగించిన వెయ్యేళ్లనాటి జైన శిల్పాలు ఇప్పుడు వెలుగు చూశాయి. క్రీ.శ. 9–10 శతాబ్దాల నాటి జైన బసది కేంద్రంలో ఉన్న జైన చౌముఖి శిల్పాలను ఈ చెరువు తూములో వినియోగించినట్టు చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఔత్సాహిక పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి ఇటీవల ఎన్కేపల్లి గ్రామానికి వెళ్లారు.ఆ సమయంలో వాన కురుస్తుండటంతో చెట్టునీడన నిలబడి ఉండగా, సమీపంలోని చెరువుకట్టలో శిల్పాలు కనిపించాయి.
ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆదివారం ఆ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా, అవి జౌన చౌముఖి శిల్పాలుగా గుర్తించారు. శిలలపై ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్ధమాన మహావీరులు ధ్యానముద్రలో ఉన్నట్టు, పైన కీర్తిముఖాలతో మలిచి ఉన్నట్లు శివనాగిరెడ్డి చెప్పారు. వాటిపై 9–10 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ లిపిలో శాసనాలు కూడా చెక్కి ఉన్నాయన్నారు.
ఆ శాసనభాగాలు చెరువుగట్టు గోడలోకి చొచ్చుకుపోయి ఉన్నందున చదవటం వీలు కావటం లేదని, జైన బసదికి చెందిన దానశాసనాలు అయి ఉండే అవకాశం ఉందన్నారు. వాటిని బయటకు తీస్తే స్థానిక చరిత్రకు సంబంధించిన వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలిపారు.
ఆ ప్రాంతం జైన కేంద్రం..
మొయినాబాద్ ప్రాంతం ఒకప్పుడు జైన కేంద్రం. సమీపంలోని చిలుకూరు ప్రాంతం రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధ జైన కేంద్రమని పేర్కొంటూ ఇటీవలే ఆ ఊళ్లోని జైన దేవాలయ జాడలను వెలుగులోకి తెచ్చారు.
చిలుకూరుకు అతి సమీపంలో ఉన్న ఎన్కేపల్లి గ్రామంలో కూడా జైన బసది కేంద్రం ఉండేదని, దానికి సంబంధించిన చౌముఖి శిల్పాలని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ జైన బసది, దాని అనుబంధ దేవాలయం ధ్వంసమైన నేపథ్యంలో, వాటి శిథిల శిల్పాలను చెరువు తూముకు వినియోగించి ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment