
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుముం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రానున్న రెండు రోజుల్లో దక్షిణాదిలోని మరికొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంఉందని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ఈసల తక్కెళ్లపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.