సాక్షి, హైదరాబాద్: కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు చాలామంది బాధితులను పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్‌లో భాగంగా కొన్ని వారాల పాటు ఈ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు మొదట్లో అంచనా వేసినా ఊహించిన దానికంటే మరీ ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని పోషకాహారం, మంచి నిద్ర, మానసిక ప్రశాంతతతో త్వరగానే అధిగమించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఆర్థిక, మానసిక, వృత్తి సంబంధిత సమస్యలతో ఈ సమస్యలను చాలామంది అధిగమించలేకపోతున్నారు.
సర్వే తీరిది..
కరోనా నుంచి కోలుకున్న వారిలో 40 శాతం మందికి మూడు నెలలకుపైగా ఏవో సమస్యలు ఎదురవుతున్నట్లు ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ పరిశోధకులు తేల్చారు. కొందరిలో ఏళ్ల తరబడి ఆరోగ్య సమస్యలు కొనసాగడానికి కారణం కావొచ్చని చెబుతున్నారు. ‘ఇంపీరియల్స్ రియాక్ట్–2’పేరిట ఇంగ్లండ్‌లోని దాదాపు 5 లక్షల మందిపై సర్వే జరిపి నిర్ధారణకు వచ్చారు. కోవిడ్ ఎలా ప్రభావితం చేసింది.. ఆ తర్వాత ఎంతకాలం పాటు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు వంటి 29 అంశాలపై ఈ సర్వే నిర్వహించారు.
దాదాపు 3, 4 నెలల పాటు కనీసం 40 శాతం మంది పలు సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వారిలో 15 శాతం మంది మూడు, నాలుగు సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. మరికొందరిలో 22 వారాల పాటు ఆయా సమస్యలు బాధిస్తున్నట్లు వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో నీరసం, ఏ పని చేయాలని అనిపించకపోవడం, ఏమీ తోచకపోవడం, కీళ్లు, కండరాల నొప్పులు, నిద్రలేమి, ఛాతీ నొప్పి, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఎదురవుతున్నట్లు తేల్చారు.
మనదగ్గరా ఇలాంటి సమస్యలే..
‘మూడు,నాలుగు నెలల తర్వాత కూడా వివిధ సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. సెకండ్ వేవ్‌లో 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. వీరిలోనే ఎక్కువ శాతం లాంగ్ కోవిడ్ సమస్యలతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడిన వారిలోనూ కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ బరువుగా ఉండటం, పనిచేస్తే ఛాతీలో నొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతి నీరసం, మానసికపరమైన ఆందోళనలు, కుంగుబాటుకు లోనవుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బతిని ‘లంగ్ ఫైబ్రోసిస్’సమస్య ఎదురైన వారికి సుదీర్ఘకాలం ఇబ్బందులు తప్పట్లేదు. డయాబెటిస్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో లాంగ్ కోవిడ్ సమస్యలు ఎక్కువ కాలం బాధిస్తున్నాయి.’
– డా.వీవీ రమణ ప్రసాద్, కన్సల్టెంట్
పల్మనాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment