సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో నిందితులను కేసు నుంచి తొలగించలేమని (డిశ్చార్జ్) చేయలేమని, తుది విచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నిందితులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారన్న వారిద్దరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పునిచ్చారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.
మహానాడు వేదికగా కుట్ర...
టీడీపీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా కుట్రలో భాగస్వామిగా మారారని, శంషాబాద్ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్‌కాల్స్, వాయిస్ కాల్స్‌లోనూ సండ్ర ప్రమేయం స్పష్టమైందని వివరించింది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
రేవంత్ అనుచరుడు ఉదయ్‌సింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. స్టీఫెన్‌సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015 మే 31న మధ్యాహ్నం 4:40 గంటలకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారులో వచ్చారని, కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారులో రూ. 50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది. సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు వేం కృష్ణకీర్తన్‌రెడ్డి నుంచి సికిం ద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి రూ. 50 లక్షలు నగదు తీసుకురావాలని రేవంత్‌రెడ్డి ఉదయ్‌సింహకు సూచించారని తెలిపింది. ఈ కేసులో ఉదయసింహ పాత్రను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... వారిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేశారు.
Comments
Please login to add a commentAdd a comment