
సాక్షి, ఆదిలాబాద్: రైతులంటే నాగలి చేతపట్టి దుక్కి దున్నడమే కాదు.. బ్యాట్ పట్టి క్రికెట్ కూడా ఆడగలమని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతులు. బోథ్‌లోని లాల్‌పిచ్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన రైతులంతా కలిసి జట్టుగా ఏర్పడి పోటీల్లో తలపడేందుకు సిద్ధమయ్యారు.
ఆదివారం ఎస్‌ఎస్ టీంతో తలపడ్డారు. ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ ఏడు పరుగుల తేడాతో రైతుల జట్టు ఓడిపోయింది. కానీ ఆ రైతులు మాత్రం తమ ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. యువకులు షూస్, యూనిఫాంతో టోర్నీ ఆడగా.. రైతులు పంచెకట్టు, కాళ్లకు చెప్పులు లేకుండా మ్యాచ్ ఆడారు.