నాటు వేసిన పొలం ఇసుకలో మునిగింది
► రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ మధ్యనే వరి నాట్లు వేయించా. భారీ వర్షాలతో పాలేరు రిజర్వాయర్ అలుగు పోసింది.
ఆ వరదతో పొలం మునిగి ఇసుక మేట వేసింది. రూ.40 వేల వరకు పెట్టిన పెట్టుబడి వరద పాలైంది. ఈ ఇసుకను తీయడానికి, మళ్లీ సాగు చేయడానికి అప్పు తేవాల్సిందే.
– భూక్యా ఉపేందర్, హాట్యతండా, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు కురిసిన భారీ వర్షాలు వేల గ్రామాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉప నదులు, వాగులు ముంచెత్తి రైతుల ఆశలపై నీళ్లుచల్లాయి. రెండేళ్ల కిందటి షాక్ నుంచి రైతులు పూర్తిగా కోలుకోకముందే.. మొలక దశలోని పంటలను వరదలు తుడిచిపెట్టాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోటెత్తిన గోదావరి, ఉప నదులతో పొలాల్లో భారీగా ఇసుక మేటలు పడ్డాయి. నది సమీప మండలాల ప్రజలను కదిలిస్తే కన్నీరే ఎదురవుతోంది.
ఇంకా తేరుకోని జనం..: భారీ వర్షాలు, వరదల నష్టం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేదు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల పొలాలు కోతకు గురై, ఇసుక మేటలు వేసి, ఇప్పట్లో పంట వేయలేని స్థితికి చేరాయి. మరో నెల రోజుల్లో పంటలు వేయకపోతే ఈ వానాకాలం సీజన్‌లో ఇక సాగు చేయడం కుదరదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే రెండు నెలలుగా దుక్కులు, విత్తనాలు, నార్లు పోయడానికి ఎకరానికి సగటున రూ.18 వేల వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండాయి, మోరంచపల్లి తదితర పల్లెలు ఘొల్లుమంటున్నాయి. వరదలతో పాడి పశువులతోపాటు ఇళ్లు, ఆస్తులను కోల్పోయి రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.
ఎన్‌పీడీసీఎల్ పరిధిలో రూ.60 కోట్ల నష్టం
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌డీపీసీఎల్) పరిధిలోని 16 జిల్లాల్లో వర్షాల వల్ల రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. సుమారు 20 వేల విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా.. 3,200 ట్రాన్స్‌ఫార్మర్లు, 140 సబ్‌స్టేషన్లు నీటమునిగాయి. 742 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇందులో 3 గ్రామాలకు తప్ప అన్నింటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
సర్వస్వం కోల్పోయి..
ములుగు జిల్లా కొండాయిలో ప్రజలు వరదలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కొత్తూరుకు పరుగులు పెట్టారు. వరద తగ్గాక నేలకూలిన ఇళ్లు, మొండిగోడలు, తడిసిన బియ్యం, కొట్టుకుపోయిన సామగ్రిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు. గ్రామానికి చెందిన గిరిజన రైతు దంపతులు బొల్లికుంట లక్ష్మి, ధనుంజయలకు చెందిన రెండెకరాల వరి నారు పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు దుక్కిటెద్దులు గల్లంతయ్యాయి. ఇల్లు దెబ్బతిన్నది. చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతో బతుకుతున్నామని వారు చెప్తున్నారు.
నారుపోయి.. ఇసుక చేరి..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు దేవేందర్‌గౌడ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం. వ్యవసాయమే జీవనాధారం. ఇటీవలే మూడెకరాల్లో వరి నాట్లు వేశారు. కానీ మోరంచవాగు వరదతో వరి నారు పూర్తిగా కొట్టుకుపోయింది. పొలంలో ఇసుక మేటలు వేసింది. దీంతో ఈసారి పంట వేయలేని పరిస్థితి నెలకొందని దేవేందర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈయన ఒక్కడే కాదు.. మోరంచపల్లిలో మరికొందరు రైతులదీ ఇదే గోస.
చిరువ్యాపారం.. చిన్నాభిన్నం
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు దొడ్ల ప్రేమలీల. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవిస్తోంది. గత నెల 28న రాత్రి పోటెత్తిన వరదలో సుమారు రూ.3 లక్షల విలువైన కిరాణా సామగ్రి, వస్తువులు కొట్టుకుపోయాయి. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె వాపోతున్నారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అవుతాపురం, రాజ్‌మాన్‌సింగ్ తండా, పోచంపల్లి, గంట్లకుంట, రంగాపురం వరకు రూ.8.70 కోట్లతో సుమారు 11 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2023 జనవరిలో ఇది పూర్తి కావాల్సి ఉన్నా జాప్యమైంది. ఇటీవలి భారీ వర్షాలతో పోచంపల్లి గ్రామ పరిధిలో ఇలా రోడ్డు కొట్టుకుపోయింది.
మూడెకరాల్లో ఇసుక మేటలు వేసింది
నా వ్యవసాయ భూమి పెద్దవాగు సమీపంలోని ఉంది. భారీ వర్షాలకు చెక్‌డ్యాం తెగి వరద పొలాన్ని ముంచేసింది. రూ.50వేలకుపైగా నష్టపోయా. 2021లోనూ నాతోపాటు అనేక మంది రైతులు ఇలాగే చెక్‌డ్యాం తెగి నష్టపోయారు. ఇప్పుడు అదే పునరావృతమైంది.
– నవీన్ యాదవ్, రైతు, సుంకేటు, నిజామాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment