అఖిల భారత కోటా 6,410 | All India NEET Quota Is 6410 | Sakshi
Sakshi News home page

అఖిల భారత కోటా 6,410

Published Tue, Sep 29 2020 2:18 AM | Last Updated on Tue, Sep 29 2020 4:51 AM

All India NEET Quota Is 6410 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వారం రోజుల్లోగా నీట్‌ ఫలితాలు వెలువడగానే ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలు మొదలుకాను న్నాయి. నీట్‌ అర్హత ద్వారానే అడ్మిషన్లు జరుగుతుండటంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు జాతీయస్థాయిలో పేరొందిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లు జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాల విద్యార్థులూ తమ ర్యాంకును బట్టి ఇష్టమైన కాలేజీల్లో సీట్లు పొందే అవకాశముంది. అందుకోసం ఆప్షన్లు ఉంటాయి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 541 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు 82,926 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి.

అందులో 278 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 42,729 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇక 263 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 38,840 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ సహా మరో 15 ఎయిమ్స్‌ల్లో 1,367 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఆ ప్రకారం జాతీయంగా 6,410 ఎంబీబీఎస్‌ సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. ఈ మేరకు జాతీయస్థాయి కౌన్సెలింగ్‌ జరగనుంది. ఆ ప్రాతిపదికనే నీట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లలో తమకు ఇష్టమైన మెడికల్‌ కాలేజీలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులకు నీట్‌ ర్యాంకు ఆధారంగా కాలేజీలను కేటాయిస్తారు. 

రాష్ట్రంలో 5,040 ఎంబీబీఎస్‌ సీట్లు..
ఎంసీఐ లెక్క ప్రకారం రాష్ట్రంలోని 32 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 5,040 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. అందులో 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్‌ సీట్లుండగా, 22 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 3,300 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో 15 శాతం అంటే 261 సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లన్నింటినీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఇక బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్లున్నా వీటన్నింటినీ జాతీయ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులు అఖిల భారత స్థాయిలో దాదాపు 8 వేల సీట్లకు పోటీపడే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అఖిల భారత కోటాలో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన అనంతరం, రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జాతీయ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక, ఇక మిగిలే సీట్లను ఆయా రాష్ట్రాలకే తిరిగి ఇచ్చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుంది. రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మిగిలిన సీట్లను మాప్‌ అప్‌ రౌండ్‌ పద్ధతి కౌన్సెలింగ్‌ ద్వారా అన్నింటినీ భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 85 శాతం సీట్లనూ, ప్రైవేటులోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. 

3 నెలలు ఆలస్యంగా అడ్మిషన్లు..
సాధారణంగా మెడికల్‌ అడ్మిషన్ల ప్రక్రియ జూలైలో ప్రారంభమై ఆగస్టు 31 నాటికి ముగుస్తుంది. ఈ ఏడాది కరోనా కారణంగా ప్రవేశాల ప్రక్రియ దాదాపు మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. గతేడాది మాదిరిగానే ఫీజులుండే అవకాశముంది. ఫీజులు పెంచాలన్న డిమాండ్‌ ఉన్నా కరోనా కారణంగా పెంపుపై ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని తెలిసింది. ప్రస్తుతం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లకు ఏడాదికి రూ.60 వేలు, మేనేజ్‌మెంట్‌ కోటా (బీ కేటగిరీ)లో రూ.11.50 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా (సీ కేటగిరీ)లో రూ.23 లక్షల వరకు వసూలు చేసుకునే వెసులుబాటుంది. 

‘నీట్‌’కీ విడుదల..
ఈనెల 13న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ మెడికల్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సమాధానాల కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. ఆ సమాధానాలను సరిచూసుకోవాలనీ, ఒకవేళ జవాబుల్లో తప్పులు దొర్లినట్లుగా భావిస్తే విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు తమ సందేహాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేయాలని పేర్కొంది. అందుకోసం అభ్యర్థులు రూ.వెయ్యి ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. సమాధాన పత్రంలో నిజంగానే తప్పులు దొర్లితే, ఆ మేరకు జవాబును సరిదిద్దుకోవడంతో పాటు విద్యార్థికి రుసుమును కూడా తిరిగి చెల్లిస్తామని తెలిపింది.

నీట్‌ నిర్వహణ అనంతరం విద్యార్థులు తాము రాసిన ప్రశ్నలకు ఎంత మేరకు సమాధానాలు సరైనవిగా ఉన్నాయో ప్రాథమికంగా సరిచూసుకొని ఒక అంచనాకు వచ్చారు. అయితే తాజాగా అధికారికంగా సమాధాన పత్రం విడుదల చేయడంతో విద్యార్థులకు తమకు ఎన్ని మార్కులు నీట్‌లో వస్తాయనే స్పష్టత ఇప్పుడొచ్చింది. దీంతో గతేడాది ఎన్ని మార్కులకు ఎక్కడ సీటు వచ్చిందనే అవగాహనతో ఈ ఏడాది కూడా ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రానున్నారు. ఆ మేరకు విద్యార్థులు కూడా నిపుణుల సలహా తీసుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement