ప్రసంగిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
బీజేపీయే ప్రత్యామ్నాయం
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ సరితూగలేదు. ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచేది బీజేపీ మాత్రమే. టీఆర్‌ఎస్ కుటుంబ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడం ఒక్క బీజేపీతోనే సాధ్యం.
రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలౌతున్నాయి. వీటిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందువల్ల ఇక్కడ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం.
ఒవైసీ చేతుల్లో కారు స్టీరింగ్
టీఆర్‌ఎస్ సర్కార్ కారు (ఎన్నికల గుర్తు) కేసీఆర్‌దే అయినా దాని స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతుల్లో ఉంది. ఎంఐఎంను తరిమికొట్టిన రోజే తెలంగాణకు అసలైన స్వాతంత్య్రం వస్తుంది.
సాక్షి, నిర్మల్: 2023 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓవైసీని శరణు కోరినా కేసీఆర్ ఈ ఓటమి నుంచి తప్పించుకోలేరన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో విజయం సాధించి నరేంద్ర మోదీ జోలెలో వేయబోతున్నామన్నారు. ఆ ఎన్నికల కంటే ముందు జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్మల్ పట్టణంలో జరిగిన బహిరంగసభలో అమిత్ షా పాల్గొన్నారు. అంతకుముందు ఇక్కడి క్రషర్ గ్రౌండ్స్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్, గిరిజన పోరాట యోధులు రాంజీ గోండు, కొమురం భీమ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగురవేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అనంతరం సభలో మాట్లాడారు.
నిర్మల్ సభకు హాజరైన ప్రజలు
కేసీఆర్ ఎవరికి భయపడుతున్నారు?
‘ప్రతి ఎన్నికను డబ్బుతో గెలవచ్చునని టీఆర్‌ఎస్ అనుకుంటోంది. కానీ సేవాభావంతో పనిచేసే వారిని గెలిపించి డబ్బు రాజకీయానికి, కుటుంబపాలనకు ముగింపు పలకాలి. మజ్లిస్ పార్టీకి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వంటి ఇతర రాజకీయ పక్షాల వారు భయపడతారేమో కానీ బీజేపీ ఎంతమాత్రం భయపడదు. ధైర్యంగా ఎదుర్కొంటుంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానన్న కేసీఆర్ వాగ్దానం ఏమైంది? కేసీఆర్ ఎవరికి భయపడుతున్నారు? (ఈ ప్రశ్న వేసి.. ఎంఐఎం అంటూ ప్రజలతో అమిత్ షా చెప్పించారు) ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన పోలీస్ యాక్షన్, ‘ఆపరేషన్ పోలో’కార్యాచరణతోనే నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం విముక్తమైంది. 13 నెలల ఆలస్యంగా స్వాతంత్య్రం వస్తే దానిని అధికారికంగా జరిపేందుకు ఎందుకు వెనకడుగు?..’అని అమిత్ షా నిలదీశారు.
5 విడతలుగా సంజయ్ పాదయాత్ర
‘తెలంగాణలో తండ్రి, కొడుకు, కూతురు కుటుంబ పాలనే తప్ప ఇంకేమీ లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కొనసాగిస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ఐదు విడతలుగా కొనసాగనుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టివచ్చేలా జనజాగృతికి చేపడుతున్న ఈ యాత్ర.. 2023లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు పునాదిగా ఉపయోగపడుతుంది.
కాంగ్రెస్ కనుమరుగవుతోంది
గత లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచాక, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడింది. మొత్తం దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతున్నందున తెలంగాణలో ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాలేదు. తెలంగాణ గౌరవ, ప్రతిష్టలను కాపాడేది బీజేపీ మాత్రమే. ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ గౌరవం కలకాలం నిలిచేలా పార్టీ చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని ప్రజల అభివృద్ధికి, దళితులు, అమాయక గిరిజనులు, బడుగు.. బలహీనవర్గాలు, మహిళలు, యువతులు, పిల్లల భద్రత, రక్షణకు కృషి చేస్తుంది..’అని హామీ ఇచ్చారు.
శుక్రవారం నిర్మల్ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్ షా. చిత్రంలో ధర్మపురి అరవింద్, డీకే అరుణ, తరుణ్ చుగ్, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, మురళీధర్‌రావు
మోదీ పాలన మరిన్ని ఏళ్లు కొనసాగాలి
‘సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినం. అలాగే ప్రపంచదేశాల్లో భారత్‌ను ముందు వరసలో నిలిపేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోదీ పుట్టినరోజు, విశ్వకర్మ జయంతి కూడా. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ రోజుకున్నాయి. దేశంలోని 130 కోట్ల మంది మోదీ దీర్ఘాయుష్షు కోసం దేవుడిని ప్రార్థిస్తున్నారు. దేశంలోని 60 కోట్ల మంది పేదల కోసం బ్యాంక్ ఖాతాలు తెరిచి, ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమాను మోదీ ప్రభుత్వం అందిస్తోంది. మోదీ చేసే ఈ యజ్ఞం ఇంకా రాబోయే ఎన్నో ఏళ్ల పాటు కొనసాగాలని ప్రజలు కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నారు..’అని అమిత్ షా చెప్పారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్‌లో నిర్మల్‌కు వచ్చిన కేంద్ర హోం మంత్రి, సభ ముగిశాక తిరిగి నాండేద్‌కు వెళ్లారు.
వీరుల త్యాగాలు వృథా కానివ్వం
‘1860లో నిజాం పాలనలో నిర్మల్‌లో వెయ్యి మంది అమాయక గిరిజన, ఆదివాసీలను ఉరి తీసిన విషయం కేసీఆర్‌కు గుర్తుకు రావడం లేదా? తొలుత ఆంగ్లేయులకు, ఆ తర్వాత నిజాంకు వ్యతిరేకంగా ఆదివాసీ, గిరిజన వీరులు పోరాడారు. తెలంగాణ వచ్చాక కూడా గిరిజనులకు ఎలాంటి మేలు జరగనందున, వారికి తగిన న్యాయం చేసేందుకే ఈ ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. గిరి జన వీరుల త్యాగాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో పోలీసు తూటాలకు బలైన 371 మంది యువత బలిదానాలు, మలిదశ ఉద్యమంలో 1,400 మంది అమరుల త్యాగాలను వృథా కానివ్వం. తెలంగాణ ఆత్మగౌరవ పునఃప్రతిష్టాపన జరిగేలా చూస్తాం. కొమురంభీం, రాంజీ గోండు, సురవరం ప్రతాపరెడ్డి, స్వామి రామానందతీర్థ, దాశర«థి రంగాచార్య, పీవీ నరసింహారావు వంటి వారు చేసిన త్యాగాలకు గుర్తింపు తీసుకొస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్లయ్యే సందర్భంగా నిర్వహించే ‘ఆజాదీకా అమత్ మహోత్సవ్’లో భాగంగా రాంజీ గోండు, కొమురం భీం వంటి పోరాట వీరుల చరిత్రను ప్రపంచానికి చాటేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కచ్చితంగా నిర్వహించి తీరుతాం. ఇక్కడకు సమీపంలోని భైంసాలో ఏమి జరుగుతోందో, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది..’అని చెప్పారు.
అవినీతి సామ్రాజ్యాన్ని పెకిలిస్తాం: బండి సంజయ్
గోల్కొండ ఖిలాలో కాషాయం జెండా రెపరెప లాడించడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పక్కాగా అధికారంలోకి వస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్, కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో సహా పెకిలిస్తామని చెప్పారు. రాష్ట్రం మూర్ఖుడి చేతిలో బందీ అయ్యిందన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకుంటుంటే, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో సేద తీరాడని విమర్శించారు. రాంజీ గోండుతో పాటు వెయ్యి మందిని ఉరితీసిన ఈ పోరాటాల గడ్డ నిర్మల్ నుంచి చేసే నినాదాలు ప్రగతి భవన్, దారుస్సలామ్‌లో రీసౌండ్ ఇవ్వాలన్నారు. తెలంగాణలో విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడం ఇక్కడి ప్రజలను అవమానించడమేనని ధ్వజమెత్తారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1,400 మంది అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజల్ని కలిసే ముఖ్యమంత్రి కావాలి..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మొదటి సంతకం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేదానిపైనే పెడతారని తెలిపారు. ఈ ఉత్సవాలను అధికారికంగా జరపకుండా ఎంఐఎం అడ్డుకుంటోందని చెప్పారు. సచివాలయానికి వచ్చే, ప్రజలను కలిసే ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవాలన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య పాలన అందిస్తుందని, తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పార్టీ నేతలు మురళీధర్‌రావు, తరుణ్ చుగ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment