జూన్ 2న సాయంత్రం ఘనంగా అవతరణ వేడుకలు
పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్‌ను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సామాన్య ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అధికారిక గేయం ’జయ జయహే తెలంగాణ’ పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణసంచా పేలుస్తూ ఉత్సవ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులు పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిథులకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.
సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్క్రీన్లతో, లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment