ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
8 బిల్లులు ఆమోదం.. 4 అంశాలపై చర్చ
సమావేశాలకు దూరంగా కేసీఆర్
మండలి భేటీకి వెళ్లని సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వారం పాటు సాగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరోపణలు– ప్రత్యారోపణలు, సవాళ్లు–ప్రతి సవాళ్లు, వాగ్వాదాలు, నిరసనలు, ఉద్రిక్తతల మధ్య శనివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో ఓఆర్‌ఆర్ లీజు టెండర్లపై సిట్ విచారణ, ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పులపై తీవ్రస్థాయిలో చర్చ జరగ్గా.. ప్రధానమైన భూ భారతితోపాటు మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభ ప్రారంభమైన తొలి రోజు నుంచి అడుగడుగునా అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు యతి్నంచింది. అధికార పక్షం కాంగ్రెస్ కూడా బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, వాటిని సరిచేయడానికే సరిపోతోందని చెప్పింది. ప్రశ్నోత్తరాలు, బిల్లులు, వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చ కోసం ప్రతిపాదించిన అంశాలపై పలు సందర్భాల్లో అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు.
సమావేశాల చివరి రోజు శనివారం రైతుభరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ కూడా రైతు రుణమాఫీ అంశంలో రేవంత్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందంటూ మాటల దాడికి దిగారు. రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేశారు.
మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లాకు సాగునీరు అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హరీశ్‌రావు నడుమ కూడా సవాళ్ల పర్వం నడిచింది. ఇన్నాళ్లూ తమ మిత్రపక్షంగా చెప్పుకున్న ఎంఐఎం విమర్శలు చేయడం బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేయగా, కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ప్రభుత్వ అప్పులపై జరిగిన చర్చలో అధికార పక్షం వాదనను పూర్తిగా సమరి్థంచింది. మరిన్ని అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని సూచించింది.
రోజుకో రచ్చ..
కొత్త రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అదానీతో రేవంత్ ఫొటోలు, ఆటో డ్రైవర్ల సమస్యలు, లగచర్ల రైతులకు బేడీలు, ప్రభుత్వ అప్పులు, గురుకుల విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, భూ భారతి బిల్లు, ఫార్ములా ఈ, రైతు భరోసా, సభా ఉల్లంఘన నోటీసులు, ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు గైర్హాజరు వంటి అంశాలు కేంద్రంగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి.
ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ కేవలం ఒక రోజు మాత్రమే సమావేశమై తిరిగి 16వ తేదీకి వాయిదా పడింది. 16న స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై స్పష్టత ఇవ్వకపోవడంతో సమావేశం నుంచి బీఆర్‌ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి.
రాష్ట్ర పర్యాటక విధానం, గురుకుల విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ అప్పులు, రైతు భరోసా అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ చేపట్టకుండానే సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి శాసనమండలి భేటీకి హాజరు కాలేదు.
ఆమోదం పొందిన 8 బిల్లులు
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలు (సవరణ), జీఎస్‌టీ (సవరణ), వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, అనర్హతల తొలగింపు (సవరణ), భూ భారతి (ఆర్వోఆర్), మున్సిపాలిటీ (సవరణ), జీహెచ్‌ఎంసీ (సవరణ), పంచాయతీరాజ్ (సవరణ) బిల్లులు.
Comments
Please login to add a commentAdd a comment