
పంజగుట్ట (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమకారులకు కనీసం డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా మంజూరు చేయలేదనే ఆవేదనతో ప్రగతిభవన్ ముందు ఉద్యమకారుడైన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. చాదర్‌ఘాట్, మూసానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ కొడారి చందర్(46) ప్రగతిభవన్ బీబీ–1 గేటు వద్ద తనతో పాటు తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకోగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 2010 తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీ గేటు వద్ద సదరు వ్యక్తి ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మహత్యకు యత్నించాడని, దీనిపై కేసు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా బతుకులు మారలేదని చందర్ ఆవేదనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారుడినైన తనకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలంటూ గతంలో పలువురు మంత్రులను కలసి వినతిపత్రమి చ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు యత్నించాడు. చందర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చందర్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులున్నారు.
శుక్రవారం ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యకు యత్నించిన ఆటో డ్రైవర్ చందర్