
విజయేంద్ర ప్రసాద్‌ని సత్కరిస్తున్న బండి సంజయ్, తరుణ్ ఛుగ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ కథారచయిత, దర్శకుడు విజేయంద్ర ప్రసాద్‌తో ఆదివారం రాత్రి బీజేపీ సీనియర్ నేతలు తరుణ్‌ఛుగ్, బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘రజాకార్ ఫైల్స్’సినిమా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సిందిగా విజయేంద్ర ప్రసాద్‌ను బీజేపీ నేతలు కోరినట్టు చెబుతున్నారు. గతంలో ఆయన రజాకార్ల ఆగడాలపై దర్శకత్వం వహించిన ‘రాజన్న’సినిమాను గురించి వారు ప్రస్తావించినట్టు తెలిసింది.
ఈ అంశంపై సినిమాకు దర్శకత్వం వహించే విషయంపై విజయేంద్రప్రసాద్ స్పందన ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణకు సంబంధించిన ఈ అంశం, ఎదుర్కొన్న ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు, ప్రజలు పడిన బాధలపై కచ్చితంగా సినిమా తీయాలనే పట్టుదలతో బీజేపీ నాయకులున్నట్టు సమాచారం. గతంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాను వీక్షించిన సందర్భంగా బండి సంజయ్ తప్పకుండా ‘రజాకార్ ఫైల్స్’సినిమా తీస్తామని ప్రకటించారు. దీనికి బలం చేకూర్చేలా తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ యత్నాలు ముమ్మరం
తెలంగాణ చరిత్రతో ముడిపడిన అంశాలు, గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో పేదలపై జరిగిన అరాచకాలు, దాష్టీకాలపై ‘రజాకార్ ఫైల్స్’సినిమా తీసేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివాదస్పదంగా మారడంతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘కశ్మీర్ ఫైల్స్’నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఈ సినిమా నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలతో ముడిపడిన ‘సెప్టెంబర్ 17 విలీనదినం’ప్రాముఖ్యతను వివరించడంతోపాటు భారతదేశంలో వివిధ సంస్థానాల విలీనంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జరిపిన కృషిని వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment