
ఓ ప్రైవేట్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలీసు విభాగంలో పనిచేసే హోంగార్డు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈమె పేరుతో బ్యాంకు అధికారులు మరో మహిళకు రూ.8.8 లక్షల వ్యక్తిగత రుణం ఇచ్చేశారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఈ సమస్య వచ్చిపడింది. విషయం తెలిసిన హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించారు.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బౌరంపేటకు చెందిన ఓ మహిళ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో హోంగార్డు. ముషీరాబాద్‌లోని యాక్సస్ బ్యాంకు ఖాతాలో ఈమె జీతం జమవుతోంది. ఆ బ్యాంకు నుంచి రూ.3 లక్షల వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె వివరాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు అప్పటికే ఆమె పేరుతో ఇండస్‌ఇండ్ బ్యాంకులో రూ.8.8 లక్షలు రుణం ఉన్నట్లు గుర్తించారు. అది తీరే వరకు మరో రుణం పొందే అవకాశం లేదన్నారు. కంగుతిన్న ఆ హోంగార్డు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా సూరారం ప్రాంతానికి చెందిన మహిళ మీ పాన్‌కార్డుతో 2018 సెప్టెంబర్ 7న రూ.8.8 లక్షల రుణం తీసుకుందని చెప్పారు. ఇప్పటికీ రూ.5,98,337 బకాయి ఉందన్నారు.
పొరపాటు.. బ్యాంకు అధికారులదే..
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన వివరాలు వినియోగించి రుణం తీసుకున్నారంటూ హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ సుంకరి శ్రీనివాసరావు దర్యాప్తు చేశారు. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2018 సెప్టెంబర్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ పేరు, హోంగార్డు పేరు ఇంటి పేరుతో సహా ఒకటే. రుణం మంజూరు సమయంలో ఈ పేరు ఆధారంగా సంబంధిత వెబ్‌సైట్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంకు అధికారులు సెర్చ్ చేశారు. ఆ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వారి పేరు, పాన్ నెంబర్, సిబిల్ స్కోర్ తదతరాలు కనిపిస్తాయి. అప్పట్లో ఈ బ్యాంకు అధికారులు సెర్చ్ చేసిన సందర్భంలో దరఖాస్తు చేసుకున్న అసలు మహిళతో పాటు మహిళా హోంగార్డు వివరాలు కనిపించాయి. బ్యాంకు అధికారులు పొరపాటున హోంగార్డు పేరు, ఆమె పాన్ నంబర్‌ను ఫిక్స్ చేస్తూ దరఖాస్తు చేసుకున్న మహిళకు రుణం మంజూరు చేశారు.
వాయిదాలను చెల్లిస్తుండటంతో..
అప్పటి నుంచి ఆమె నెలసరి వాయిదాలను సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకు అధికారులకు వివరాలు సరిచూడాల్సిన అవసరం రాలేదు. తాజాగా మహిళ హోంగార్డు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు జరిపిన పరిశీలనతో తెరపైకి వచ్చింది. ఈ విషయాలను దర్యాప్తులో గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు పక్షాలను ఠాణాకు పిలించారు. అసలు విషయం వారందరికీ వివరించగా తమ పొరపాటును సరిదిద్దుకునేందుకు అంగీకరించిన ఇండస్ ఇండ్ అధికారులు వివరణ కూడా ఇచ్చారు.