సద్దులు.. పాటల సుద్దులు | Bathukamma Festival Special Story In Karimnagar District | Sakshi
Sakshi News home page

సద్దులు.. పాటల సుద్దులు

Published Sat, Oct 24 2020 8:34 AM | Last Updated on Sat, Oct 24 2020 11:14 AM

Bathukamma Festival Special Story In Karimnagar District - Sakshi

సాక్షి, కరీంనగర్‌‌: ప్రపంచంలో ఎక్కడా మహిళలకంటూ ప్రత్యేక పండుగ లేదు. కానీ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ ఆ లోటును పూడ్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తొమ్మిది రోజులపాటు పూలను పూజించే గొప్ప సంస్కృతికి మన రాష్ట్రం వేదిక. పండుగ ముగిసేవరకు పల్లె, పట్టణం తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంటుంది. ఏడాదికోసారి ఆడబిడ్డలు తమ కష్టాలు, బాధలను మరిచి, ఆనందంగా గడిపే సమయమిది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గత వారం రోజులుగా ఆటపాటలతో పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం జరిగే సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు.

గునుగు పూలు
తెలుగు లోగిళ్లలో సందడి...
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ సందడిగా మారుతాయి. పండుగ సందర్భంగా అత్తవారింటి నుంచి తమ ఆడబిడ్డలను పుట్టింటికి ఆహ్వానిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన మహిళలు, యువతులు ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తారు. కొత్త దుస్తులు ధరిస్తారు. మధ్యాహ్న సమయానికి అన్నదమ్ములు తీసుకుచ్చిన పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, పూజ చేస్తారు.

చివరి రోజు రెండు బతుకమ్మలు 
తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో సాగే వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు మాత్రం రెండు బతుకమ్మలు పేరుస్తారు. ముఖ్యంగా మన ఇళ్లలో ఆడబిడ్డకు వివాహం చేసి, అత్తారింటికి సాగనంపినప్పుడు తోడు పెళ్లికూతురుగా మరొకరని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మకూ కొనసాగిస్తున్నారు. నిమజ్జనం రోజు పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి, పూలతో అందంగా పేర్చి సాగనంపుతారు.

చామంతి పూలు
పిండి పదార్థాలకు ప్రత్యేకత..
వానకాలం ముగిసి, చలికాలం ప్రారంభమయ్యే సమయంలో వచ్చే సద్దుల బతుకమ్మ రోజు వాయినాలు ఇచ్చుకునేందుకు పిండి పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. పెసలు, బియ్యం పిండితో సత్తు, పులిహోర, పెరుగన్నం తదితరాలు సిద్ధం చేస్తారు. ఇవన్నీ వాతావరణం మార్పునకు లోనైన సమయంలో మానవ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే ఔషధీయ విలువలను కలిగి ఉంటాయి. బతుకమ్మల నిమజ్జనం తర్వాత ఈ పిండిపదార్థాలను మహిళలు వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రత్యేక బడ్జెట్‌తో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందుకోసం సర్కారు చాలా చోట్ల బతుకమ్మ ఘాట్‌లను నిర్మించింది. 

ఇదీ పండుగ నేపథ్యం..
తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు సైతం విస్తరించిన బతుకమ్మ పుట్టుక వెనక ఆసక్తికర కథనాలెన్నో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలంలో అంటే 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలు న్నాయి. పూలను బతుకుగా భావించి, మహిళలు పూబొడ్డెను గౌరమ్మగా పూజించడం వల్ల బతుకమ్మ అనే పేరు వచ్చిందని భావన. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి, పెద్దదై రాక్షస సంహారం చేయడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అనేది ఒక నేపథ్యం. గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తన తలపై పెట్టుకున్న గంగను చూసి, పార్వతి అసూయ పడుతుంది. గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పడు తల్లి ఓదార్చి గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి, పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతతరం చెందిందని కూడా చెబుతారు.

పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుంటే పెద్ద వదిన పాలలో విషం కలిపి, మరదలికి తాగించి చంపుతుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని ఊరి బయట పాతి పెడుతుంది. అక్కడ అడవి తంగేడు చెట్టు పుట్టి విరగబూస్తుంది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు పూలిద్దామని తెంపబోతే ఆమె ఆత్మ తన మరణం గురించి చెబుతుంది. అప్పుడు అన్నలు నీకు ఏం కావాలో కోరుకొమ్మంటే ఈ తంగెడు పూలల్లో నన్ను చూసుకోమని, ఏటా నా పేర పండుగ చేయండని అంటుంది. ఇలా ఈ పండుగ ప్రారంభమైనట్లు మరో కథ. చాలా కాలం కిందట సంతానం కోసం పరితపిస్తున్న దంపతులకు ఓ అమ్మాయి దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి, పెంచి పెద్ద చేస్తారు.

ఆమె పలు మహిమలు చూపుతూ లోకహిత కార్యాలు చేస్తుంది. దీంతో మహిళలు ఆమె చుట్టూ చేరి, దైవ స్వరూపంగా భావించి, పూజలు చేస్తారు. ఇది క్రమంగా బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు కారణమైందని ఇతిహాసం. మరో కథలో ఓ దంపతులకు కలిగిన పిల్లలు కలిగినట్లుగా మరణిస్తుంటే పార్వతిని ప్రార్ధించారట. ఆమె దయతో ఒక కూతురు కలిగి, బతుకుతుందట. ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేయడంతో ఈ పండుగ వచ్చిందని ప్రతీతి.

తీరొక్క పూల కూర్పు ‘బతుకమ్మ’
మహిళలు గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింట తదితర పూలతో గోపురం ఆకారంలో  బతుకమ్మను పేరుస్తారు. దాని పైభాగంలో గౌరీదేవికి ప్రతిరూపమైన గుమ్మడి పువ్వు, పసుపు ముద్దలను ఉంచుతారు. అనంతరం అగర్‌బత్తీలు, ప్రమిదలు వెలిగించి, వీధుల కూడళ్లకు తీసుకెళ్లి బతుకమ్మలను ఒక్కచోట చేర్చుతారు. పాట తెలిసిన పెద్దావిడ ఒకరు బతుకమ్మ పాటను ఆలపిస్తే మిగిలిన వాళ్లంతా ఆమెను అనుసరిస్తూ గొంతు కలుపుతారు. బతుకు పాటలు, శ్రమజీవుల వెతలు, గౌరీదేవి మహత్యం, పతివ్రతల ఇతివృత్తాలు ప్రధానాంశాలుగా బతుకమ్మ పాటలు పాడుతారు. అర్ధరాత్రి వరకు ఆడిపాడి, సమీపంలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. 

కరీంనగర్‌లో నిమజ్జన ప్రాంతాలు  
నగరంలోని మానేరు వాగు బ్రిడ్జి సమీపంలోని వేద పాఠశాల వద్ద, రాంచంద్రపూర్‌ కాలనీలోని మానేరు డ్యాం, కొత్తపల్లి చెరువు, కిసాన్‌నగరలోని గర్లకుంట, చింతకుంట కాలువ  వద్ద బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement