
సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వర్ధన్‌పెట్ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అద్వర్యంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 2 వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. .కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటేచేసుకుంది. బండి సంజయ్‌ను గోషామహాల్ పీఎస్‌కు తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డంగా పడుకున్నారు. తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ చుట్టూ 144 సెక్షన్ విధింపు
గెరిల్లా వ్యూహంతో అసెంబ్లీ ముట్టడికి నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. గన్‌పార్కు వద్దకు బీజేపీ మహిళ మోర్చా నేతలు దూసుకొచ్చారు. అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తుండటంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ ,రవీంద్రభారతి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అసెంబ్లీ చుట్టూ కిలోమీటర్ మేర 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. అయినప్పటికీ మూడంచెల భద్రతను దాటుకుని బీజేపీ శ్రేణులు అసెంబ్లీ వద్దకు విడతల వారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయగా, మరికొంతమంది బీజేపీ నాయకులను అసెంంబ్లీకి రానివ్వకుండా మార్గమధ్యంలోనే అరెస్టు చేశారు. వీరిని గోశామహల్ స్టేడియం, నారాయణ గూడ పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే 200 మందికి పైగా బేజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ చుట్టూ భద్రతను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.