
సాక్షి, మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కనబడడం లేదంటూ ఆయన ఫొటోను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి మంచిర్యాల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ ఫొటోను పట్టుకుని అన్ని షాపులు, ప్రజలను కనిపించారా..? అని ప్రశ్నిస్తే కనబడలేదనే సమాధానం చెప్పారని, ఎంపీగా గెలిచినప్పటినుంచి జిల్లాలో అప్పుడప్పుడు పర్యటించడమే తప్ప ప్రజల వద్దకు వెళ్లడంగానీ, ప్రజా సమస్యలపైన తెలుసుకునే ప్రయత్నంగానీ చేయడం లేదన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏబీవీపీ కార్యకర్తగా పనిచేస్తూ అంచలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని, అదే వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. టీఆర్‌ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఎంపీ టికెట్‌పై గెలిచారని, నాడు కాంగ్రెస్ ఉంటూ టీఆర్‌ఎస్ పార్టీని ఇష్టారీతిన తిట్టిన వ్యక్తి కేసీఆర్‌పై ప్రేమను చూపిస్తున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా సమస్యలపై మాట్లాడాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని అడగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణ, బీజేపీ జిల్లా కార్యదర్శి మల్యాల శ్రీను, వాణిజ్య సెల్ కన్వీనర్ రంగ శ్రీశైలం, ప్రభాకర్, ముథా మల్లేశ్, పల్లి రాకేశ్, బోయిని దేవేందర్, గంగన్న, మల్లిఖార్జున్, రాజన్న, శ్రీకాంత్, తరుణ్ సింగ్, ప్రసన్న పాల్గొన్నారు.