సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన సిట్.. బీజేపీ సీనియర్ నేతకు నోటీసులు ఇచ్చింది. దీంతో, ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ దర్యాప్తుపై మండిపడుతున్నారు.
అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక, బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగింది. మరోవైపు.. సిట్ నోటీసులపై హైకోర్టులో స్టే ఇవ్వాలని బీజేపీ కోరింది. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని సిట్ వేధిస్తోందని బీజేపీ ఆరోపించింది.
ఇదిలా ఉండగా.. సిట్ నోటీసులపై శనివారం హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. 41ఏ నోటీసుల వెనుక అరెస్ట్ చేసే కుట్ర దాగి ఉంది. కేసుతో సంబంధంలేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో 8 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment