సాక్షి, సంగారెడ్డి: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పి ఎంతో కష్టం మీద పెళ్లికి ఒప్పించారు. తీరా.. పెళ్లి సమయానికి వరుడు వివాహ వేడుక నుంచి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కాగా, వరుడు వెళ్లిపోడానికి కారణం తెలిసి అక్కడున్న వారంత ఖంగుతిన్నారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాకుండా.. ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. ఇక, తన లవర్ పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు రంగంలోకి దిగాడు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి ఫోన్ చేసి తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దీంతో, ఈ విషయాన్ని పెళ్లి కూతురు పేరెంట్స్ చెప్పి అతను పెళ్లికి నిరాకరించాడు.
దీంతో, వధువు పేరెంట్స్ చేసేదేమీ లేక.. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం, పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కొండాపూర్ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లికి కొద్ది గంటలే సమయం ఉందనగా వరుడు ప్లేట్ ఫిరాయించాడు. తనకు కట్నంగా రూ.15 లక్షలు ఇస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. దీంతో, అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అనంతరం.. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్
Comments
Please login to add a commentAdd a comment